సంక్షిప్త వార్తలు (6)

మహిళాలోకానికి రాందేవ్‌బాబా బహిరంగ క్షమాపణలు చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావులు డిమాండ్‌ చేశారు.

Updated : 27 Nov 2022 05:51 IST

‘మహిళలకు రాందేవ్‌ బాబా క్షమాపణలు చెప్పాలి ’

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మహిళాలోకానికి రాందేవ్‌బాబా బహిరంగ క్షమాపణలు చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావులు డిమాండ్‌ చేశారు. మహిళలపై రాందేవ్‌బాబా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శనివారం గాంధీభవన్‌ ముందు మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను కలిసి రాందేవ్‌బాబాపై ఫిర్యాదు చేశారు.


జగన్‌ది ‘కోతల ప్రభుత్వం’: నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌ది కోతల ప్రభుత్వమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘ప్రతిపక్ష నేతగా కోతలు- ప్రభుత్వాధినేతగా వాతలు.. ఇది జగన్‌మోసపురెడ్డి తీరు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘నిరుపేద గిరిజనులు, దళితులకు 200 యూనిట్లలోపు వాడుకుంటే... ఇస్తున్న ఉచిత విద్యుత్తు వెసులుబాటును ఎత్తేసేందుకు ఆరు దశల పరిశీలన పేరుతో కొత్త ఎత్తుగడ వేయడం జగన్‌ బాదుడేబాదుడు పరిపాలనకి నిదర్శనం. ఒక్క అల్లూరి జిల్లాలోనే 20 వేలకి పైగా గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్తు లేకుండా చేసిన వైకాపా సర్కారు... రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది గిరిజనుల ఇళ్లల్లో చీకట్లు నింపుతోంది’ అని ఆయన శనివారం ట్వీట్‌ చేశారు.


ట్వీట్లు కాదు.. రోడ్లపై గుంతలు పూడ్పించండి

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జాతీయ రహదారులపై ప్రమాదాలు, మరణాలంటూ ట్వీట్లు చేయడం కాదు... ముందు రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్పించాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు. దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారులపైనే జరుగుతున్నాయంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై ఘాటుగా స్పందించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి నీతులు చెప్పడం పక్కనపెట్టి ముందు మీ జగన్‌కు చెప్పి రోడ్లపై గుంతలు పూడ్పించు. జగన్‌రెడ్డి గుంతల రోడ్డు పథకానికి పది నెలల్లోనే 5,831 మంది ప్రాణాలు కోల్పోయారు విజయసాయిరెడ్డి’ అని శనివారం ట్వీట్‌ చేశారు.


రుషికొండ తవ్వకాలపై వాస్తవాలు వెల్లడించాలి: సీపీఎం

ఈనాడు, అమరావతి: విశాఖలోని రుషికొండ ప్రాజెక్టును సందర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదో వివరణ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. పర్యావరణాన్ని ధ్వంసం చేసే అనుమతులు కేంద్రం ఎలా ఇచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ‘ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలను చూడడానికి కోర్టు అనుమతి తీసుకోవాలా? ప్రతిపక్షాలను ఎందుకు అరెస్టులు చేస్తోంది? పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పునర్నిర్మిస్తున్న బీచ్‌ రిసార్టు ప్రాజెక్టు అడ్డగోలుగా నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోర్టులు చీవాట్లు పెట్టినా మంత్రులు ఎందుకు అడ్డగోలు వాదనలు చేస్తున్నారు? రుషికొండ ప్రాంతంలో సర్వే నంబరు 29/1లో 4.97ఎకరాల ప్రభుత్వ భూమి భూకబ్జాదారుల చేతిలో ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే వత్తాసు పలకడం అన్యాయం’ అని విమర్శించారు.


బీసీ ఉప ప్రణాళిక నిధుల మళ్లింపు ద్రోహం కాదా?: అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసి, రూ.34 వేల కోట్ల బీసీ ఉపప్రణాళిక నిధులను దారిమళ్లించడం ద్రోహం కాదా? అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బీసీలను మరోసారి మోసం చేసేందుకే వైకాపా బీసీ మంత్రులు, నేతలతో సీఎం జగన్‌ సమావేశం నిర్వహించి తప్పుడు ప్రకటనలు చేయించారని మండిపడ్డారు. ‘మూడున్నరేళ్లలో 26 మంది బీసీ నేతల్ని హత్య చేయించారు. వేల మందిపై దాడులకు పాల్పడ్డారు. వందల మందిపై అక్రమకేసులు బనాయించారు. అన్ని వర్గాలకు అమలు చేస్తున్న పథకాలనే బీసీలకు అందిస్తూ... వాటినే ప్రత్యేక పథకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆదరణ, బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలను రద్దు చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు కోతపెట్టి బీసీలకు రాజ్యాంగ పదవులు దూరం చేశారు’ అని ఆరోపించారు.


రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు

తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్‌రఫీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రహదారుల నిర్మాణంపై సీఎం జగన్‌ ఉత్తుత్తి సమీక్షలు చేయడం తప్ప ఒక్క గుంతైనా పూడ్చింది లేదని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్‌రఫీ ధ్వజమెత్తారు. గజానికో గుంతతో రాష్ట్రంలోని రోడ్లు పదుల సంఖ్యలో ప్రజలను బలిదీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నిధులు కేటాయించకుండా సమీక్షలు చేస్తే రహదారులు బాగుపడతాయా? బారికేడ్లు ఏర్పాటు చేయడంలో చూపించే శ్రద్ధ రహదారులను వేయడంలో చూపించాలి. గ్రామస్థాయిలో స్థానికులే రోడ్లు బాగు చేయించుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ తన సొంత నిధులతో రోడ్లు వేయించారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు హయాంలో పడిన గుంతలే పెద్దవయ్యాయంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ మూడున్నరేళ్లుగా ఏం చేస్తున్నారు’ అని సయ్యద్‌రఫీ ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని