భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న కేంద్రం

రాజ్యాంగ మూల సిద్ధాంతమే కాంగ్రెస్‌ మూల సిద్ధాంతమని.. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆపార్టీ శాసనసభా పక్షనేత భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు.

Updated : 27 Nov 2022 05:45 IST

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ పాలన
సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ధ్వజం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాజ్యాంగ మూల సిద్ధాంతమే కాంగ్రెస్‌ మూల సిద్ధాంతమని.. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆపార్టీ శాసనసభా పక్షనేత భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ పాలన సాగుతోందని విమర్శించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీభవన్‌లోని ఇందిరాభవన్‌లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన సదస్సు జరిగింది. కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి పౌరుడూ గౌరవంగా జీవిస్తున్నారంటే ఈ దేశానికి కాంగ్రెస్‌ ద్వారా అంబేడ్కర్‌ ఇచ్చిన రాజ్యాంగం పుణ్యమేనన్నారు. కానీ నేడు దేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా మోదీ పాలన సాగుతోందని, భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని, సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో ప్రశ్నించే గొంతులను, ప్రతిపక్ష నాయకులను అణచివేస్తున్నారని దుయ్యబట్టారు. భాజపా, తెరాసలు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు. బడుగు, బలహీన, బహుజన అవకాశాలు కొల్లగొట్టి కొందరికి మాత్రమే రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా మనుధర్మ శాస్త్రాన్ని భాజపా ముందుకు తీసుకువచ్చిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పార్టీ శ్రేణులతో భట్టివిక్రమార్క ప్రమాణం చేయించారు. నాయకులు బోసురాజు, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఆర్‌.దామోదర్‌రెడ్డి, గడ్డం వినోద్‌, మల్లు రవి, జి.నిరంజన్‌, శివసేనారెడ్డి, సునీతారావు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు