అమిత్‌ షా మాటల్లో అధికార మత్తు : ఒవైసీ

‘అమిత్‌ షా అధికార మత్తులో ఉన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని ఆయన గుర్తించాలి.

Updated : 27 Nov 2022 08:39 IST

అహ్మదాబాద్‌, కచ్‌: ‘అమిత్‌ షా అధికార మత్తులో ఉన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని ఆయన గుర్తించాలి. ఏదో ఒకరోజు దాన్ని ప్రజలు లాక్కొంటారు’ అని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. గుజరాత్‌లో హింసకు పాల్పడేవారికి 2002లో గుణపాఠం చెప్పడం ద్వారా భాజపా రాష్ట్రంలో శాంతి నెలకొల్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ ఎదురుదాడికి దిగారు. అహ్మదాబాద్‌ సమీపంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జహాపురాలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘మీరు నేర్పిన పాఠం బిల్కిస్‌బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబాన్ని దారుణంగా హతమార్చిన 11 మంది దోషులకు స్వేచ్ఛ కల్పించి జైలు నుంచి విడుదల చేయడమేనా?’ అని ప్రశ్నించారు. గోద్రా అల్లర్ల అనంతరం జరిగిన దాడుల్లో కాంగ్రెస్‌ ఎంపీ ఎహసాన్‌ జాఫ్రీ సహా పలువురు ముస్లింలను చంపడమేనా మీరు నేర్పిన పాఠమని ఒవైసీ నిలదీశారు.   

మాది ఓట్లు చీల్చే పార్టీ కాదు

ఎంఐఎం ఓట్లు చీల్చే పార్టీ అనే ఆరోపణలను ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు. కేవలం కాంగ్రెస్‌ అసమర్థత వల్లే భాజపా దీర్ఘకాలంపాటు గుజరాత్‌లో అధికారంలో ఉందన్నారు. ‘మేమిక్కడ 13 స్థానాల్లో మాత్రమే పోటీలో ఉన్నాం. మిగతా 169 సీట్లలో కాంగ్రెస్‌ను గెలవమనండి చూద్దాం’ అని సవాలు విసిరారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కచ్‌ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్‌గాంధీ ఓటమి భాజపాతో ‘‘సెట్టింగ్‌’’లో భాగం కావచ్చని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రచారంలో ముస్లిం వ్యతిరేక కథనాలు అల్లేందుకు భాజపా ఉమ్మడి పౌరస్మృతి, శ్రద్ధా హత్యకేసు వంటి విషయాలు ప్రస్తావిస్తోందని చెప్పారు. గుజరాత్‌లో మీరు కొన్ని స్థానాలు గెలిచి, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే ఏం చేస్తారని అడగ్గా.. అది ఊహాజనిత ప్రశ్న అని ఒవైసీ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని