‘ప్రత్యేక హోదా’ పోరాటాన్ని కొనసాగించాలి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాజకీయ పోరాటాన్ని కొనసాగించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. పార్లమెంటులో విభజన బిల్లుపై జరిగిన చర్చలో అన్ని పార్టీలూ హోదా అవసరమని తెలిపాయని, పార్లమెంటులో సమర్థించిన భాజపా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని ఆరోపించారు.

Published : 27 Nov 2022 04:56 IST

సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాజకీయ పోరాటాన్ని కొనసాగించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. పార్లమెంటులో విభజన బిల్లుపై జరిగిన చర్చలో అన్ని పార్టీలూ హోదా అవసరమని తెలిపాయని, పార్లమెంటులో సమర్థించిన భాజపా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ప్రత్యేక హోదా.. విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. మూడు రాజధానుల పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న భాజపా, వైకాపాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కని స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం వైకాపా, తెదేపా గతంలో ధర్నాలు చేశాయని, ప్రధాని మోదీకి భయపడి ఇప్పుడు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. హోదా కోసం ధర్నా చేసిన పవన్‌ కల్యాణ్‌ నాడు మోదీకి వినిపించాలని హిందీలో గట్టిగా అరిచారని, ఇప్పుడు భాజపా పంచన చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నేత లక్ష్మీ నరసింహ యాదవ్‌ ప్రసంగించారు. ఆందోళనలో సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వం, సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ సదాశివరెడ్డి, వివిధ పార్టీల నేతలు రావుల వెంకయ్య, దినేష్‌, కుమార్‌ చౌదరి యాదవ్‌, సాకే నరేశ్‌, ఎన్‌.లెనిన్‌ బాబు, జాన్సన్‌బాబు, రవీంద్ర, పరమేశ్‌, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని