తాడిపత్రి ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం.. విశ్రాంత అధికారి దంపతుల మౌన దీక్ష

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ భూగర్భ జలశాఖ విశ్రాంత సంయుక్త సంచాలకుడు వెంకటరామయ్య చంద్రశేఖర్‌ తన భార్య విజయ కుమారితో కలిసి శనివారం మౌన దీక్ష చేశారు.

Updated : 27 Nov 2022 07:26 IST

న్యాయం కోరినా స్పందించని కేతిరెడ్డి

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ భూగర్భ జలశాఖ విశ్రాంత సంయుక్త సంచాలకుడు వెంకటరామయ్య చంద్రశేఖర్‌ తన భార్య విజయ కుమారితో కలిసి శనివారం మౌన దీక్ష చేశారు. ముచ్చుకోట గ్రామానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు అమర్‌నాథ్‌రెడ్డి, జయరామిరెడ్డి తమ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్షల విలువ చేసే తమ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ‘ముచ్చుకోటలో సర్వే నంబరు 177లో 14 సెంట్ల స్థలం కొండ మీద రామలింగేశ్వరస్వామి ఆలయం ట్రస్టు పేరిట ఉండటంతో పాటు సర్వ హక్కులు మాకే ఉన్నాయి. అందుకు సంబంధించిన రికార్డులను అధికారులకు అందజేశాం. ఉద్యోగరీత్యా కర్నూలులో ఉన్న సమయంలో మాకు తెలియకుండా కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించి ఆలయాన్ని నిర్మించారు. మిగిలిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుంటే ఎమ్మెల్యే అనుచరులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. దాడులకు పాల్పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కలిస్తే ఆయన అనుచరులకే వత్తాసు పలుకుతున్నారు’ అని వివరిస్తూ ఆ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసిన తమకే ఇలాంటి దుస్థితి ఎదురైతే.. సామాన్యుల పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దారు, ఎస్పీ, డీఎస్పీలను సంప్రదించినా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మౌన దీక్ష చేశారు. తహసీల్దారు షర్మిలను వివరణ కోరగా... ‘177 సర్వే నంబరులో 14 సెంట్ల స్థలంపై సర్వ హక్కులు వెంకటరామయ్య చంద్రశేఖర్‌కు ఉన్నాయి. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుంటే కొందరు గ్రామస్థులు అడ్డుకుంటున్న మాట వాస్తవమే’ అని పేర్కొన్నారు. గ్రామ సభ ఏర్పాటు చేసి ఇరువురి వాదనలను విన్నామని, అక్కడ తేలకపోవడంతో... న్యాయస్థానంలో తేల్చుకోవాలని సూచించామని చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని