Pawan Kalyan: ఓటు చీలనివ్వకండి

‘మీ ఓటును చీలనివ్వకండి. జనసేనకే వేయాలని చెప్పను. జనసేన మీ కోసం నిలబడుతుందనుకుంటే మాకు ఓటు వేయండి. లేదు, మరో పార్టీ నిలబడుతుందనుకుంటే పూర్తిగా వారికే వెయ్యండి. మీలో మీరు విడిపోయి మనల్ని మనమే పలచన చేసుకోవద్దు’ అని బీసీ కులాలకు పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

Updated : 27 Nov 2022 08:52 IST

తూర్పు కాపులతో సమావేశంలో పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘మీ ఓటును చీలనివ్వకండి. జనసేనకే వేయాలని చెప్పను. జనసేన మీ కోసం నిలబడుతుందనుకుంటే మాకు ఓటు వేయండి. లేదు, మరో పార్టీ నిలబడుతుందనుకుంటే పూర్తిగా వారికే వెయ్యండి. మీలో మీరు విడిపోయి మనల్ని మనమే పలచన చేసుకోవద్దు’ అని బీసీ కులాలకు పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ‘2024 నుంచి రెండు ఎన్నికల్లో మీరు బలంగా నిలిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు బీసీల చేతిలో ఉంటుంది. లేకపోతే కొద్దిమందే ఆధిపత్యం చలాయిస్తారు. ఈ పరిస్థితి మారాలి. దానికి తగ్గట్టుగా మేం అడుగులు వేస్తాం. మాకు ఆశీస్సులివ్వండి’ అని పవన్‌ కోరారు. వైకాపాకు మీరూ ఓట్లు వేయబట్టే వారికి 151 సీట్లు వచ్చాయి. మీ సమస్యలపై వారు మీతోనూ చర్చించట్లేదు. బొత్స పెద్ద నాయకుడే.. మంత్రిగా ఉన్నారు. ఆయన మీకు ఏమీ చేయలేకపోవచ్చు. ఆయనా అధినాయకత్వానికి లొంగాలి. ఆయనే అలా ఉంటే ఇక సగటు తూర్పు కాపు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇది మారాలంటే ఓటు చీలకుండా చూసుకోండి’ అని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో శనివారం రాత్రి ఆయన తూర్పు కాపు నాయకులతో సమావేశమయ్యారు. తొలుత వారి సమస్యలను పవన్‌ కల్యాణ్‌కు వివరించారు.

ముందే సంఘటితం కావాలి

‘రాయలసీమ నాయకుడొకరు బీసీలకు అంతిచ్చాం.. ఇంతిచ్చామని చెబుతున్నారు. అసలు ఎవరు ఇచ్చేవాళ్లు? ఎవరు తీసుకునేవాళ్లు? ఎవరైనా అధికారంలోకి రావాలంటే అన్ని కులాలూ ఓట్లు వేయాల్సిందే. అత్యధిక జనాభా బీసీ కులాల్లోనే ఉంది. కానీ తక్కువ సంఖ్యాబలం ఉన్న కులాల్లోనే ఐక్యత ఉంది. మనలో నాయకత్వం పెంచుకోవాలి. అధికారం లేని ఏ కులమైనా ముందే సంఘటితం కావాలి. బీసీలకు వందకు పైగా కార్పొరేషన్లు పెట్టి, ఒక పదవి పడేసి రూ.75వేలు జీతం పడేస్తే ఆ కులం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక నాయకుడు కాదు.. అందరూ బాగుపడాలి. మీరు ధైర్యంగా, బలంగా ఉండాలి.

పార్టీని నడిపించే సత్తా ఉంది

రాజకీయాల్లో మనోధైర్యం కావాలి. అది ఉన్నవాడే రాజకీయాలు చేయగలరు. అది ఉన్న బీసీ నాయకులను ప్రోత్సహించండి. డబ్బులు అక్కర్లేదు. నేను రూ.కోట్లు లేకుండానే రాజకీయం చేస్తున్నా. 2008 నుంచి దెబ్బలు తిని ఉన్నాను. దేనికైనా ఫిట్‌నెస్‌ పరీక్ష ఉంటుంది. రాజకీయాలకూ అంతే. ఓడిపోయినా బలంగా నిలబడ్డా. సమస్యలపై మాట్లాడి ఎదగాలి. జనసేన అలా ఎదిగిన పార్టీ. ఈ ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడరు.. అజ్ఞానంలో ఉంటారు. నేను ఉద్దానం వెళ్లలేదన్న మహానుభావుడు ఆయన. వీరు కోడికత్తి డ్రామాలో ఉంటే నేను ఉద్దానం వెళ్లాను. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నవాణ్ని. నేను చేస్తానంటే చేస్తా. ఈ నమ్మకం సాధించుకునేందుకు పదేళ్లు పట్టింది. నమ్మితే భరోసా ఉంచండి. అధికారం దిశగా మా చేత అడుగులు వేయించండి. మీకు నిజాయతీగా రాజ్యాంగ దినోత్సవం రోజు చెబుతున్నా. మీరు ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదు. మమ్మల్ని నమ్మండి.. అండగా ఉండండి. మీ సమస్యల పరిష్కారానికి నేను నిలబడకపోతే చొక్కా పట్టుకోండి. తూర్పు కాపులను మూడు జిల్లాలకే పరిమితం చేయడం సరికాదు. మిగతా పది జిల్లాల్లోనూ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రితోనూ వీరి సమస్యలపై మాట్లాడతా. తూర్పు కాపులకు ఓబీసీ ధ్రువీకరణ పత్రం మూడు జిల్లాలకే ఎందుకు పరిమితం చేశారో డీఫ్యాక్టో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి’ అని పవన్‌ కల్యాణ్‌ డిమాండు చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని