Pawan Kalyan: వైకాపాను కూల్చేదాకా నిద్రపోను

వైకాపాను దెబ్బ కొట్టాలంటే భాజపా పెద్దలకు, ప్రధానికి చెప్పి చేయను. ఇది నా నేల. రాష్ట్రంలోనే తేల్చుకుంటా.. మాట్లాడితే వైకాపా నేతల్లా దిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయం.

Updated : 28 Nov 2022 07:13 IST

సవాలు చేస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తా
ప్రధానికి చెప్పను.. నేనే యుద్ధం చేస్తా..
పిచ్చిపిచ్చిగా వాగిన వారందరికీ అధికారంలోకి రాగానే బదులిస్తా
ఇసుక తవ్వకాలవల్లే అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయింది
వైకాపాపై నిప్పులు చెరిగిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

వైకాపాను దెబ్బ కొట్టాలంటే భాజపా పెద్దలకు, ప్రధానికి చెప్పి చేయను. ఇది నా నేల. రాష్ట్రంలోనే తేల్చుకుంటా.. మాట్లాడితే వైకాపా నేతల్లా దిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయం. మా యుద్ధాలకు భాజపా పెద్దల
మద్దతు అడగం. ఇక్కడే తేల్చుకుంటా. నేనే యుద్ధం చేస్తా.


రాష్ట్రాన్ని 30 ఏళ్లపాటు పాలించాలని జగన్‌ అనుకుంటున్నారు. కానీ రాబోయే 30 ఏళ్లపాటు మీరు, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని.. మీరంతా ఎదగాలని నేను కోరుకుంటున్నా. జనసేన, వైకాపా మధ్య
మౌలికంగా ఉన్న తేడా అదే.

పవన్‌ కల్యాణ్‌


ఈనాడు, అమరావతి: తమ పార్టీ ఆవిర్భావ సభకు భూములిచ్చారనే కక్షతో ఇప్పటంలో పేదల గడపలు కూల్చారని, అలాంటి వైకాపా గడపను కూల్చేదాకా నిద్రపోనని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శపథం చేశారు. ‘సవాలు చేస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తాం. వైకాపా భూస్వాముల కోటను బద్దలు కొడతాం’ అని విరుచుకుపడ్డారు. ఆదివారం మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఇప్పటం బాధితులైన 39 కుటుంబాల వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఏ కారణంతో ఇప్పటంలో మా వాళ్ల ఇళ్లు కూల్చేశారో.. అదే న్యాయంతో వైకాపా ఎమ్మెల్యేల ఇళ్లను కూలగొట్టిస్తాం. 2024 ఎన్నికల తర్వాత మీరంతా మాజీ ఎమ్మెల్యేలవుతారు. పిచ్చిపిచ్చిగా వాగిన ప్రతి ఒక్కరికీ మేం అధికారంలోకి వచ్చాక.. బాధ్యత గుర్తు చేస్తా’ అని హెచ్చరించారు. వైకాపాను చూసి పేట్రేగిపోయి, కళ్లు నెత్తికెక్కి మాట్లాడే ప్రతి ఒక్కరికీ ఇదే నా హెచ్చరిక, విన్నపం, విజ్ఞాపన అనుకోండి’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటంలో కూల్చివేతల వెనుక కనిపించని ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఇసుక తవ్వకాలవల్లే ఏడాది కిందట అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయిందని, యంత్రాంగం నిర్లక్ష్యం, రాజకీయ వ్యవస్థ పర్యవేక్షణా వైఫల్యమే దీనికి కారణమని దుయ్యబట్టారు.

వైకాపా ఒక ఉగ్రవాద సంస్థ

వైకాపా రాజకీయ పార్టీ కాదని, ఉగ్రవాద సంస్థ అని పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. ‘ఒక హంతకుడి ద్వారా గతంలోనే ప్రతిపక్ష నేతను చంపించే వాళ్లమని అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే సోదరుడు చెప్పారు. హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే ప్రతిపక్ష నేత కుమారుడే తమ లక్ష్యమని ఉగ్రవాదుల్లా మాట్లాడారు. అలాంటి ఉగ్రవాద సంస్థకు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు’ అని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. పరిశ్రమలు పెడతామని వచ్చినవారినీ వైకాపా నేతలు డబ్బులు డిమాండు చేస్తున్నారని మండిపడ్డారు. 

మాది విప్లవసేన

‘వైకాపా పెద్ద మనిషి మమ్మల్ని రౌడీ సేన అంటున్నారు. రౌడీయిజం, గూండాయిజం చేసే వాళ్లకు ఎదురు తిరుగుతున్నాం కనుక వారికి రౌడీల్లా కనిపిస్తే సరే. మాది రౌడీ సేన కాదు.. విప్లవ సేన. ప్రజల దృష్టిలో మేం విప్లవకారులమే. కుల సమూహాలన్నీ దేహీ అనే ధోరణి నుంచి బయటకు రావాలి. మేమే పెట్టి పుట్టాం. మేమే రాజకీయం చేయగలమనే వారికి స్వస్తి పలకాలి. 2024, 2029 ఎన్నికలే లక్ష్యంగా జనసేన ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. కుల, అంగ, అర్థబలం లేకున్నా రాజకీయాల్లో పోటీ చేసే వ్యవస్థ వచ్చేవరకు పోరాడతా. నేను కులాలను వేరు చేస్తున్నానని కొందరు అనుకుంటున్నారు. కానీ నేను కులాలను కలుపుతున్నా’ అని చెప్పారు.

200 మంది ప్రాణాలు కాపాడిన రామయ్య

జల వనరులశాఖలో లస్కర్‌గా పనిచేసే రామయ్య అన్నమయ్య ఆనకట్ట కొట్టుకుపోయి వరద తరుముకొస్తున్న వేళ 200 మందికి ఫోన్‌ చేసి వారి ప్రాణాల్ని కాపాడారని పవన్‌ కల్యాణ్‌ ప్రశంసించారు. ఆయనను సత్కరించి రూ.2 లక్షల చెక్కు అందజేశారు. ‘థాయ్‌ బాక్సర్‌గా 22 ఏళ్లకే ఎన్నో పతకాల్ని సాధించిన వంశీకృష్ణ.. వరదల కారణంగా తన కలల్ని చంపేసుకుని మూటలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరిగి బ్లాక్‌బెల్ట్‌ టెస్ట్‌కు వెళ్లేలా మద్దతిస్తాం’ అని హామీ ఇచ్చారు. అతనికి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. తనను కుమారుడిగా ఆదరించిన నాగేశ్వరమ్మను వేదికపైకి పిలిచి పవన్‌ పాదాభివందనం చేశారు.


ఇప్పటం అభివృద్ధికే రూ.50 లక్షలు.. జగన్‌కు కాదు

జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చినందుకే ఇప్పటం గ్రామానికి పవన్‌ కల్యాణ్‌ రూ.50 లక్షలు ప్రకటించారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. అయితే కొందరు మూర్ఖులు ఆ డబ్బును సీఆర్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయాలని లేఖ రాశారని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ ఇస్తామన్న డబ్బు గ్రామాభివృద్ధి కోసమేనని, జగన్‌మోహన్‌రెడ్డికి కాదని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని