సంక్షిప్త వార్తలు(6)

జీవో 217తో సీఎం జగన్‌ మత్స్యకారుల పొట్టకొట్టారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మండిపడ్డారు.

Updated : 28 Nov 2022 06:00 IST

జీవో 217తో మత్స్యకారులకు ఉరి
ముఖ్యమంత్రి జగన్‌కు అనగాని సత్యప్రసాద్‌ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జీవో 217తో సీఎం జగన్‌ మత్స్యకారుల పొట్టకొట్టారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మండిపడ్డారు. తెదేపా హయాంలో చెరువులు, రిజర్వాయర్లు, నదుల్లో చేపల వేటను మత్స్యకారులకు అప్పగించగా ఇప్పుడు చెరువుల్ని బడా వ్యాపారులకు కట్టబెట్టి.. జగన్‌ తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఇదేనా మత్స్యకారుల అభివృద్ధి అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘గతంలో వేటనిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని ప్రతి మత్స్యకారునికీ అందించగా ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్యలో కోత వేశారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు అమలయ్యే చంద్రన్నబీమా పథకానికి తూట్లు పొడిచారు. కనీసం వేటకువెళ్లి చనిపోయిన వారికి మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం దారుణం. గతంలో పెరిగిన డీజిల్‌ ధర ప్రకారం రాయితీపై ఆయిల్‌ అందిస్తే ఇప్పుడు మంగళం పాడేసి.. పైగా ఉద్ధరించినట్లు చెప్పడం సిగ్గుచేటు’ అని అనగాని మండిపడ్డారు.


ప్రభుత్వాసుపత్రులను నరక కూపాలుగా మార్చేశారు
తెదేపా అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాటిని వైకాపా ప్రభుత్వం నరకకూపాలుగా మార్చేసిందని తెదేపా అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ధ్వజమెత్తారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.450 కోట్లు బకాయిలు పెట్టి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఫలితంగా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయలేమంటూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఆసుపత్రులు బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. మంత్రి విడదల రజిని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నీతి ఆయోగ్‌ ఆరోగ్య సూచిక ర్యాంకింగ్స్‌లో తెదేపా హయాంలో నాలుగో స్థానంలో ఉన్న ఏపీ.. వైకాపా హయాంలో పదోస్థానానికి పడిపోవటమేనా మీరు చేసిన అభివృద్ధి అని ఎద్దేవా చేశారు.


కాంగ్రెస్‌ ‘రైతు పోరుబాట’.. సమన్వయకర్తల నియామకం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రైతు సమస్యలపై నిర్వహిస్తున్న పోరుబాట నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఆదివారం సమన్వయకర్తల జాబితా విడుదల చేశారు.

ఈ నెల 30న నియోజకవర్గ కేంద్రాలు, డిసెంబరు 5న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. జిల్లాలకు ఇప్పటికే సీనియర్‌ నాయకులను సమన్వయకర్తలుగా నియమించిన విషయం తెలిసిందే.


అబద్ధాలతో సానుభూతికి  మోదీ యత్నం: ఖర్గే

డెడియాపాడా: అబద్ధాలు చెబుతూ సానుభూతి పొందేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గుజరాత్‌ నర్మదా జిల్లా డెడియాపాడాలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. నిరుపేద నేపథ్యం గురించి ఒకసారి, తనను అనవసరంగా కొందరు దూషిస్తుంటారని మరోసారి ప్రధాని చెబుతుంటారని గుర్తుచేశారు.

నేను టీ ఇస్తే తాగరు: ‘నేను అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చాను. మీరు (మోదీ) ఇచ్చిన టీని ప్రజలు సేవించారు. నేను టీ ఇస్తే తాగరు. అలాంటి అస్పృశ్యత ఉన్న కులం నుంచి వచ్చాను. ప్రజలు ఏమీ అర్థం చేసుకోలేనంత అవివేకులు కారు. వారిప్పుడు తెలివైనవారు’ అని ఖర్గే అన్నారు.


సోమనాథ్‌, అజ్‌మేర్‌లపై కాంగ్రెస్‌ అభ్యర్థి వ్యాఖ్యలతో దుమారం

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంద్రనీల్‌ రాజ్‌గురు పవిత్ర స్థలాలు సోమనాథ్‌, అజ్‌మేర్‌ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శనివారం ఓ బహిరంగ సభలో ఇంద్రనీల్‌ ప్రసంగించారు. ‘‘నా దృష్టిలో మహదేవ్‌, అల్లా ఇద్దరూ ఒకటే. మహదేవ్‌ అజ్‌మేర్‌లో ఉంటారు. అల్లా సోమనాథ్‌లో ఉంటారు. అల్లాహు అక్బర్‌’’ అని ఆయన పేర్కొన్నారు. అజ్‌మేర్‌ ముస్లింలకు, సోమనాథ్‌ హిందువులకు పవిత్ర ప్రాంతాలు కావడంతో.. ఇంద్రనీల్‌ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


అతివకు దక్కని ఆదరణ

బరిలో మహిళలు 8.5 శాతమే

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ఓటర్లలో మహిళల వాటా దాదాపు 50%గా ఉన్నా.. ఎన్నికల్లో పోటీ విషయంలో మాత్రం వారికి సముచిత ప్రాధాన్యం దక్కలేదు. రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఈసారి 1,621 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో మహిళల సంఖ్య కేవలం 139 (8.5%). అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సంయుక్తంగా వారికి కేటాయించిన టికెట్ల సంఖ్య 38 మాత్రమే. ప్రస్తుతం కమలదళం తరఫున 18 మంది స్త్రీలు (2017లో 12 మందే) పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ 14 (2017లో 10), ఆప్‌ 6 టికెట్లను వారికి ఇచ్చింది. 56 మంది మహిళలు స్వతంత్రులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ దఫా 101 స్థానాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ 13 టికెట్లను అతివలకు కేటాయించింది. 13 చోట్ల బరిలో దిగిన ఎంఐఎం ఇద్దరు మహిళలకు టికెట్లిచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు