రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా గవర్నర్లు

కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలపై రాజ్యాంగం ఇచ్చిన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా భాజపాయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

Published : 28 Nov 2022 04:17 IST

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలపై రాజ్యాంగం ఇచ్చిన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా భాజపాయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో వారి తీరు ఆక్షేపణీయంగా ఉందని చెప్పారు. గవర్నర్లంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారులుగా ఉండాలని, రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా..  సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తుండటం దురదృష్టకరమని విమర్శించారు. ‘టెకీస్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సీతారాం ఏచూరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘ది ఐడియా ఆఫ్‌ ఇండియా’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ‘‘మనది ప్రజాస్వామ్య దేశం. పౌరుల హక్కుల కోసం రాజ్యాంగం పటిష్ఠ చట్టాలను ఏర్పరిచింది. అలాంటి మన దేశం ప్రమాదంలో పడింది. లవ్‌ జిహాద్‌ పేరుతో భిన్న విశ్వాసాలను అనుసరించే వారి మధ్య వివాహాలను నిషేధిస్తూ ఇప్పటికే భాజపా పాలిత రాష్ట్రాలు చట్టాలను చేస్తున్నాయి. కేంద్రంలోని భాజపా సర్కారు దామోదర్‌ సావర్కర్‌ ప్రతిపాదించిన హిందూ రాష్ట్ర భావనను శరవేగంగా అమలు చేస్తోంది. ప్రజల్ని మత, కుల ప్రాతిపదికన చూసే ధోరణి పెరిగిపోతోంది.  దామోదర్‌ సావర్కర్‌, మహమ్మద్‌ అలీ జిన్నాలు ఒక దేశంలో రెండు దేశాల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. హిందూ రాష్ట్ర భావనను ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు తెస్తే, రెండేళ్ల తర్వాత ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను జిన్నా ఎత్తుకున్నాడు. భారతదేశ భావన ఇందుకు భిన్నమైంది. ఆ భావన రాజ్యాంగ మూలస్తంభాలుగా ఉన్న వాటిలో ప్రస్ఫుటమైంది. గతంలో యూరోపియన్‌ దేశాల్లో మెజారిటీవాదమే జాతీయవాదంగా చెలామణి అయ్యేది. ప్రస్తుతం భారత్‌లో ఆ పరిస్థితిని చూస్తున్నాం. దేశ స్వాతంత్య్ర పోరాటానికి కొనసాగింపుగా.. సోషలిజం, ఆర్థిక స్వాతంత్య్రం కోసం ఇప్పుడు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ఏచూరి వెల్లడించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు