మోదీ ప్రభుత్వ విధానాలతోనే రైతు ఆత్మహత్యలు

మోదీ ప్రభుత్వ విధానాలతోనే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని, రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆలిండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్ల పేర్కొన్నారు.

Published : 28 Nov 2022 04:17 IST

ఆలిండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్ల

నీలగిరి, న్యూస్‌టుడే: మోదీ ప్రభుత్వ విధానాలతోనే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని, రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆలిండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్ల పేర్కొన్నారు. నల్గొండలో ఆదివారం రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. నల్లచట్టాలు తెచ్చి రోజుకు 50 మంది రైతుల ఆత్మహత్యకు కారణమైందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సుమారు 500 రైతు సంఘాలు ఏడాది పాటు దిల్లీ రహదారులపై పోరాటాలు నిర్వహించాకే కేంద్రం రద్దు చేసిందని గుర్తుచేశారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యూటీఓ, గాట్‌ ఒప్పందాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిసెంబరులో కేరళలో ఆలిండియా కిసాన్‌ సభ నిర్వహిస్తామని చెప్పారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ ధావలే, సహాయ కార్యదర్శి డాక్టర్‌ విజ్జు కృష్ణన్‌, ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని