Bandi Sanjay: పేదల రాజ్యం తెచ్చేందుకే యాత్ర

తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెడితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన అభివృద్ధి ఏమీ లేదని.. అవినీతిలో, అప్పుల్లో, నిరుద్యోగుల్ని మోసగించడంలో, కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడంలో రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

Updated : 28 Nov 2022 05:55 IST

రాష్ట్రాన్ని కేసీఆర్‌ రూ.5 లక్షల కోట్ల అప్పులపాలు చేశారు
37 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పు కాదా?
‘ఎమ్మెల్యేలకు ఎర’.. ఓ డ్రామా..
‘ఈనాడు’ ముఖాముఖీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెడితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన అభివృద్ధి ఏమీ లేదని.. అవినీతిలో, అప్పుల్లో, నిరుద్యోగుల్ని మోసగించడంలో, కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడంలో రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌రావు.. ఈ అయిదుగురు మాత్రమే అభివృద్ధి చెందారని.. ధనిక రాష్ట్రమైన తెలంగాణను ముఖ్యమంత్రి రూ.5 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని ఆరోపించారు. మరోసారి అధికారమిస్తే అప్పుల్ని రెట్టింపు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నుంచి అయిదో విడత ప్రజాసంగ్రామయాత్ర తలపెట్టిన నేపథ్యంలో సంజయ్‌ ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

నాలుగు విడతల పాదయాత్రతో ఎలాంటి ఫలితం సాధించారు? అయిదో విడత లక్ష్యమేంటి?

అన్నివర్గాల ప్రజల్ని కలిసి సమస్యలు తెలుసుకున్నా. వీటి ఆధారంగానే పార్టీ మేనిఫెస్టో రూపొందిస్తాం. తెరాస ప్రభుత్వ వైఫల్యాలు, మోసాల్ని, కేంద్ర ప్రభుత్వ పథకాల్ని వివరించి ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో ప్రజల్ని కలుసుకోవాలి. పేదల రాజ్యం తేవడమే నా యాత్ర లక్ష్యం. నాలుగు విడతల్లో 48 నియోజకవర్గాల్లో పూర్తయింది. అయిదో విడతలో ఎనిమిది నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సాగుతుంది.

తొలి విడత పాదయాత్రకు భాగ్యలక్ష్మి ఆలయం, అయిదో విడత భైంసా.. భావోద్వేగ అంశాల్ని రాజకీయంగా భాజపా వాడుకుంటోందన్న విమర్శలపై...?

హైదరాబాద్‌లో మతకలహాలు జరగాలని తెరాస కోరుకుంది. నేను ప్రశాంతంగా యాత్ర చేశా. అప్పుడు గొడవలేం జరగలేదు కదా? భైంసాను ఒక వర్గానికి గుత్తగా రాసిచ్చారా? ఇన్ని రోజులూ నా పాదయాత్ర ప్రజాస్వామ్యబద్ధంగానే సాగింది.

అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలొస్తాయని భావిస్తున్నారా? మీ సన్నద్ధత ఎలా ఉంది?

తెరాస ఏక్‌ నిరంజన్‌ పార్టీ. ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఎన్నికలెప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు ఆశావహ అభ్యర్థులున్నారు. ఎన్నికలు ముందస్తుగా వస్తే పాదయాత్ర ఆపి ముఖ్య నాయకులమంతా కలిసి బస్సు యాత్ర చేపడతాం.

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. సిట్‌ దర్యాప్తు ప్రభావాన్ని భాజపా ఎలా అధిగమిస్తుంది?

ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్‌ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రాన్ని కేంద్రం ఆర్థికంగా ఇబ్బంది పెడుతోందన్న సీఎం విమర్శలపై..?

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా.. కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్ర నిధుల్ని దారి మళ్లిస్తోంది. అభివృద్ధి పనులకు రాష్ట్ర వాటా ఇవ్వరు. కేంద్ర సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయట్లేదు. రాష్ట్ర ఆదాయం కంటే తన కుటుంబం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఆదాయం తగ్గిపోతుందేమోనన్నదే సీఎం బాధంతా. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది తెలంగాణ. నిజంగా ముఖ్యమంత్రి ప్రజారంజకంగా పాలిస్తే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఎందుకివ్వట్లేదు? ఇచ్చిన హమీల్ని ఎందుకు అమలు చేయట్లేదు? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రోజ్‌గార్‌ మేళాతో ఈ సంవత్సరం 10 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పింది. రెండు నెలల్లో 1.46 లక్షల ఉద్యోగాలిచ్చారు. కేంద్ర ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలిస్తున్నారు. రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా?

కేంద్ర ప్రభుత్వం ఐటీ, ఈడీ వంటి సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలపై..?

ఫిర్యాదులొస్తే విచారణ చేయవద్దా? ప్రజల్ని దోచుకున్నవారిని విడిచిపెడదామా? అక్రమంగా సంపాదించిన తమ నాయకుల బండారం బయటపడుతుందనేదే సీఎం బాధ. లేదంటే నిజాయతీ నిరూపించుకోమని వారికి ఎందుకు చెప్పట్లేదు? తప్పు చేయకుంటే న్యాయస్థానాల్లో నిరూపించుకోవచ్చు.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా అగ్రనేతలపైనే ఆరోపణలొస్తున్నాయి..?

ఇతర పార్టీల నుంచి 37 మంది ఎమ్మెల్యేల్ని కొన్న సీఎం ముందుగా సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఆ బేరం జరిగింది? తెరాస చేర్చుకుంటే ఒప్పు, ఇతర పార్టీలు చేర్చుకుంటే తప్పా? భాజపాలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాం. అదీ మా చిత్తశుద్ధి. నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేస్తే తెరాస సర్కార్‌ కూలిపోతుందా? మా ప్రభుత్వం ఏర్పడుతుందా? సీఎంకు తన ఎమ్మెల్యేలపైనే విశ్వాసం లేదు. ఆయనకు దమ్ముంటే ఆ 37 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. దిల్లీ మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎమ్మెల్యేలకు ఎర డ్రామాకు తెరలేపారు. బీఎల్‌ సంతోష్‌ మచ్చలేని వ్యక్తి. ఈ డ్రామాలను ప్రజలు నమ్మరు. భాజపానే అభివృద్ధి చేస్తుందని వారు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని