రాజస్థాన్‌లో కఠిన నిర్ణయాలు తీసుకుంటాం

రాజస్థాన్‌లో అంతిమంగా పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలనైనా తీసుకోవటానికి వెనుకాడబోమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు.

Updated : 28 Nov 2022 05:48 IST

పార్టీ ప్రయోజనాలే మాకు ముఖ్యం
గహ్లోత్‌-పైలట్‌ విభేదాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌

ఇందోర్‌: రాజస్థాన్‌లో అంతిమంగా పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలనైనా తీసుకోవటానికి వెనుకాడబోమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు. ఆయన ఆదివారం రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, మాజీ  ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలపై స్పందించారు. ‘‘సంస్థే మాకు ముఖ్యం. రాజస్థాన్‌ సమస్యలో పార్టీలో బలోపేతం చేసే పరిష్కారాన్నే కనుగొంటాం. ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాం. రాజీ చేయాలనుకుంటే (గహ్లోత్‌, పైలట్‌ వర్గాల మధ్య) చేస్తాం’’ అని రమేశ్‌ పేర్కొన్నారు. అయితే సమస్య పరిష్కారానికి తానెలాంటి కాలపరిమితిని చెప్పలేనని, కాంగ్రెస్‌ అధినాయకత్వమే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అదే సమయంలో గహ్లోత్‌, పైలట్‌ ఇద్దరూ కాంగ్రెస్‌కు కావాల్సిన వారేనని జైరాం పేర్కొనడం గమనార్హం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సచిన్‌ పైలట్‌ను ‘ద్రోహి’ అని పేర్కొంటూ గహ్లోత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.


నాకెవరిపైనా కోపం లేదు: థరూర్‌

మరోవైపు కేరళ కాంగ్రెస్‌లో ఎంపీ శశిథరూర్‌ పర్యటన వివాదాస్పదమవుతోంది. ఉత్తర కేరళలో ఆయన ఒక రోజు పర్యటించడంపై రాష్ట్ర కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకొనేందుకే తిరువనంతపురం ఎంపీ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. వీటిని థరూర్‌ ఖండించారు. తనకు కేరళ కాంగ్రెస్‌లో ఎవరిపైనా కోపం లేదని అన్నారు. తాను పార్టీ ఆదేశాలను మీరలేదని, ఎందుకు వివాదం సృష్టిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని