ఓట్లు రాలవని ఉగ్రదాడుల్ని ఖండించరు

కాంగ్రెస్‌, మరికొన్ని భావసారూప్య పక్షాలు ఉగ్రవాదాన్ని.. విజయసాధనకు అడ్డదారిగా చూస్తాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. భారీ ఉగ్రదాడులు జరిగినప్పుడు అవి కిమ్మనకుండా కూర్చుంటాయనీ, ఓటు బ్యాంకు దెబ్బతినకూడదనే ఉద్దేశమే దానికి కారణమని ఆరోపించారు.

Published : 28 Nov 2022 05:09 IST

వారి మౌనముద్రకు అర్థం అదే
బుజ్జగింపులు ఉన్నంతకాలం ఉగ్రభయం తప్పదు
ఉగ్రవాదాన్ని అడ్డదారిగా చూసేది కాంగ్రెస్‌: మోదీ

ఖేడా: కాంగ్రెస్‌, మరికొన్ని భావసారూప్య పక్షాలు ఉగ్రవాదాన్ని.. విజయసాధనకు అడ్డదారిగా చూస్తాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. భారీ ఉగ్రదాడులు జరిగినప్పుడు అవి కిమ్మనకుండా కూర్చుంటాయనీ, ఓటు బ్యాంకు దెబ్బతినకూడదనే ఉద్దేశమే దానికి కారణమని ఆరోపించారు. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ‘ఉగ్రవాదం ఇంకా ముగిసిపోలేదు. కాంగ్రెస్‌ తరహా రాజకీయాలూ మారలేదు. ఉగ్రవాదాన్ని ఆ పార్టీ ఎప్పుడూ ఓటుబ్యాంకు కోణం నుంచే చూస్తుంది. అధికారం కోసం చిన్న పార్టీల తహతహ మరింత ఎక్కువ. బుజ్జగింపు రాజకీయాలు కొనసాగినంతకాలం ఉగ్రవాద భయం ఉంటుంది. పెద్దఎత్తున ఉగ్రదాడులు జరిగినప్పుడు ఈ పార్టీల నోళ్లు మూతపడతాయి. పైగా ఉగ్రవాదుల్ని రక్షించడానికి దొడ్డిదారిన వారు న్యాయస్థానాలకూ వెళ్తారు. బాట్లాహౌస్‌ ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు ఉగ్రవాదుల కోసం ఓ కాంగ్రెస్‌ నేత ఏడ్చారు. ఇలాంటి పార్టీల పట్ల గుజరాత్‌తోపాటు దేశమంతా అప్రమత్తంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. ‘2014 సార్వత్రిక ఎన్నికల్లో మీరు వేసిన ఒక్క ఓటు.. ఉగ్రవాదంపై మన పోరును బలోపేతం చేసింది. మన నగరాలపై దాడులు చేసే ఆలోచన సంగతే కాదు.. సరిహద్దుల్లో అలా చేయాలన్నా వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉగ్రవాదులున్నారు. భారత్‌ జోలికి వెళ్తే తమ ఇళ్లకే ఎసరు వస్తుందని వారికి తెలుసు’ అని చెప్పారు. ఉగ్రవాదంపై కంటే తనపైనే మునుపటి యూపీయే సర్కారు గురిపెట్టేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ కొనసాగితే మొబైల్‌ బిల్లు రూ.5,000 వచ్చేది

దేశంలో గిరిజనులంటే కాంగ్రెస్‌కు గౌరవం లేదనీ, అందుకే రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిందని మోదీ చెప్పారు. భరూచ్‌ జిల్లా నేత్రంగ్‌లో జరిగిన మరో సభలో ఆయన మాట్లాడుతూ- ముర్ము అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని ముకుళిత హస్తాలతో కోరినా కాంగ్రెస్‌ అంగీకరించలేదని విమర్శించారు. బిర్సా ముండా, గోవింద్‌ గురు వంటివారినీ ఆ పార్టీ గౌరవించలేదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో కొనసాగి ఉంటే మొబైల్‌ బిల్లులు నెలకు రూ.5,000 వరకు వచ్చేవనీ, ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు.

సూరత్‌లో భారీ రోడ్‌ షో

సూరత్‌ నగరంలో ఆదివారం సాయంత్రం మోదీ భారీ రోడ్‌ షో నిర్వహించారు. విమానాశ్రయం నుంచి 27 కి.మీ. పొడవునా రహదారికి ఇరువైపులా ప్రజలు బారులుతీరి ఆయనకు స్వాగతం చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు