ఎమ్మెల్యే సోదరుడి వ్యాఖ్యల వెనుక కుట్రకోణం

తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబాన్ని చంపుతామని ఎమ్మెల్యే సోదరుడు బహిరంగంగా చేసిన వ్యాఖ్యల వెనుక కుట్రకోణం ఉందని, దీనిపై పోలీసులు విచారణ జరపాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ డిమాండుచేశారు.

Updated : 29 Nov 2022 04:03 IST

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌

ఈనాడు డిజిటల్‌-అనంతపురం, న్యూస్‌టుడే-రాణినగర్‌: తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబాన్ని చంపుతామని ఎమ్మెల్యే సోదరుడు బహిరంగంగా చేసిన వ్యాఖ్యల వెనుక కుట్రకోణం ఉందని, దీనిపై పోలీసులు విచారణ జరపాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ డిమాండుచేశారు. చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం అనంతపురం జిల్లా తెదేపా నాయకులు ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనంతపురం వచ్చిన పట్టాభిరామ్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఫేస్‌బుక్‌లో ప్రభుత్వానికి లేదంటే వైకాపా నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే అర్ధరాత్రి కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అలాంటిది మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిని చంపుతామని బహిరంగంగా మాట్లాడిన చంద్రశేఖర్‌రెడ్డిపై ఇంతవరకు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదు. చంద్రశేఖర్‌రెడ్డిపై కఠినమైన సెక్షన్లు పెట్టి విచారించాలి’ అని పట్టాభిరామ్‌ కోరారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులు చేస్తే ఎస్‌హెచ్‌వోలు స్పందించడం లేదని, బాధితులపైనే కేసులు పెడుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెదేపా అనుబంధ సంఘాల నిరసన ఉద్రిక్తం

చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెదేపా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం అనంతపురంలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు నాయకుల చొక్కాలు పట్టుకొని ఈడ్చిపడేసి, బలవంతంగా అరెస్టుచేశారు. తోపులాటలో పలువురు నేతలు కిందపడ్డారు. సోమవారం అనంతపురంలోని చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి ముట్టడికి తెదేపా శ్రేణులు బయల్దేరాయి. పోలీసులు వారిని కట్టడి చేశారు. ఈ సందర్భంగా టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు కింద పడ్డారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబును ఈడ్చుకుంటూ జీపులో వేయడంతో చేతికి గాయమైంది. తెదేపా ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు, రఘురామరాజు, శ్రీరామ్‌ చినబాబు, పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్‌ తదితరులను అరెస్టుచేసి మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

బాధకలిగితే క్షమించండి: చంద్రశేఖర్‌రెడ్డి

తాను మాట్లాడిన దాంతో ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే తన బాధను అర్థం చేసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని