తీర్పు ప్రతిపక్షాలకు మొట్టికాయలాంటిది

మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Updated : 29 Nov 2022 04:03 IST

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వచ్చే నెల 5వ తేదీన కర్నూలులో మూడు రాజధానులపై నిర్వహించే సభ సన్నాహాలపై పార్టీ నేతలతో చర్చించేందుకు ఆయన సోమవారం కర్నూలు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు రాజధానులపై చట్టం చేసిన తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి మద్దతు పలికారన్నారు. తీర్పు ప్రతిపక్షాలకు మొట్టికాయలాంటిదన్నారు.


వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం...

- మంత్రి బొత్స సత్యనారాయణ

ఈనాడు, దిల్లీ: అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దిల్లీలోని ఏపీ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించిందన్నారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు అనడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రైతుల మధ్య జరిగిన ఒప్పందాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏనాడూ యూటర్న్‌ తీసుకోలేదని, నాడు రాజధాని పెట్టేటప్పుడే అకస్మాత్తుగా చెబితే ఎలా అని ప్రశ్నించారన్నారు.


మా వాదనలకు బలం చేకూరింది

-మంత్రి అమర్‌నాథ్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాజధానిపై నిర్ణయం తీసుకునే విషయంలో పలు అంశాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నందునే తమ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. కొన్ని అంశాలపై సోమవారం సుప్రీం స్టే విధించడంతో తమ వాదనకు బలం చేకూరిందని చెప్పారు.  


చంద్రబాబుకు జ్ఞానోదయం 

- మంత్రి అంబటి

ఈనాడు, అమరావతి: ‘అమరావతి కేసుల విషయంలో సుప్రీంకోర్టు సోమవారం వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల వరకూ చూస్తే ఇది వికేంద్రీకరణకు బలాన్నిచ్చే అంశంగా వైకాపా భావిస్తోంది’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘సుప్రీంకోర్టు ఉత్తర్వులను చదువుకున్న తరవాతైనా చంద్రబాబులాంటి వారికి జ్ఞానోదయం అవుతుందని అనుకుంటున్నా. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని వెళ్లేందుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నా. దీనిపై న్యాయ నిపుణులు స్పష్టతనివ్వాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించారు.


సీఎం ఆలోచన సరైందే

- పురపాలక మంత్రి సురేష్‌

సీఎం జగన్‌ ఆలోచన విధానం సరైందని అనడానికి ..అమరావతి అభివృద్ధిపై కాలపరిమితి విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఒక సూచికగా ఉందని పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కోర్టు తీర్పులు, సూచనలు పరిగణనలోకి తీసుకొని అమరావతిలో పెండింగ్‌ పనులు పూర్తి చేస్తామని సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.


సుప్రీం ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం

- కొడాలి నాని

నెహ్రూచౌక్‌(గుడివాడ), న్యూస్‌టుడే: అమరావతిలో కొనసాగుతున్న నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని, ఇది ఒక మంచి పరిణామమని గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని అన్నారు. గుడివాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమనే జగన్‌మోహన్‌రెడ్డి వాదనకు ఈ ఉత్తర్వులతో బలం చేకూరిందన్నారు. సంకల్పసిద్ధి కుంభకోణంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నట్లు రుజువు చేయగలిగితే తాను దేనికైనా సిద్ధమని కొడాలి నాని సవాలు విసిరారు. సీబీఐతో విచారణ చేయించాలని తానే ముఖ్యమంత్రిని అడుగుతానన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు