వరంగల్‌ జిల్లాలో వైఎస్‌ షర్మిల అరెస్టు

వరంగల్‌ జిల్లాలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Published : 29 Nov 2022 04:21 IST

పాదయాత్రకు వ్యతిరేకంగా తెరాస శ్రేణుల ఆందోళనలు
ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిపై ఆమె వ్యాఖ్యలకు నిరసన
కారవాన్‌, వైఎస్సార్‌ విగ్రహం, ఫ్లెక్సీల దహనం

ఈనాడు డిజిటల్‌-మహబూబాబాద్‌, న్యూస్‌టుడే-నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ: వరంగల్‌ జిల్లాలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. శనివారం రాత్రి నల్లబెల్లిలో, ఆదివారం నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అందుకు నిరసనగా పాదయాత్రను అడ్డుకునేందుకు తెరాస నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉందంటూ పాదయాత్రను నిలిపివేయాలని షర్మిలను నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు కోరారు. ఆమె నిరాకరించారు. సోమవారం ఉదయం 10.15 గంటలకు నర్సంపేట మండలం రాజపల్లెలో యాత్రను ప్రారంభించారు. చెన్నారావుపేట జల్లి క్రాస్‌రోడ్డు నుంచి లింగగిరి వరకు తెరాస నాయకులు, కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శంకరాం తండా సమీపంలో నిలిపిన ఆమె కారవాన్‌పై కొందరు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆ సమయంలో కారవాన్‌లో షర్మిల లేరు. పక్కనే ఉన్న ఇన్నోవా వాహనం అద్దాలనూ పగలగొట్టారు. వైతెపా కార్యకర్తలు నీళ్లు పోసి మంటలను ఆర్పారు. దాడులను ఖండిస్తూ వారు ఆందోళన చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న షర్మిల అదే కారవాన్‌లో భోజనం చేసి.. విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు కర్రలు, పొట్లాలలో పెట్రోలుతో కారవాన్‌ వద్దకు రాగా.. వారిని పోలీసులు చెదరగొట్టారు. మరోవైపు చెన్నారావుపేట మండలం సూరిపల్లి క్రాస్‌రోడ్డులో వైఎస్సార్‌ విగ్రహంపై, వైతెపా ఫ్లెక్సీలపై కొందరు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. లింగగిరిలో తెరాస శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

పాదయాత్ర నిలిపివేతకు నిరాకరించడంతో..

ఉద్రిక్తతలు పెరిగిపోతుండడంతో శంకరాం తండా సమీపంలోనే పాదయాత్రను నిలిపివేయాలంటూ వైతెపా వరంగల్‌, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌కు నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు నోటీసు అందించారు. అందుకు అంగీకరించకపోవడంతో మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్‌ మహిళా ఎస్సైలతో షర్మిలను అరెస్టు చేయించారు. ఆమెను వరంగల్‌ మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. వైతెపా కార్యకర్తలు వాహనానికి అడ్డుగా పడుకున్నారు. వారిపై పోలీసులు స్పల్పంగా లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. అనంతరం బందోబస్తు నడుమ షర్మిలను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఆమె కారవాన్‌, ప్రచార రథం, ఇతర వాహనాలను చెన్నారావుపేట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొస్తుండగా శంకరాంతండా, జల్లి, ఠాణా వద్ద కొందరు రాళ్లు విసిరి అద్దాలను పగలగొట్టారు. పాదయాత్రలో విధ్వంసం సృష్టించి ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన, కారవాన్‌ను దహనం చేయడానికి తెరాస నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ వైతెపా చెన్నారావుపేట మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసులే దగ్గరుండిదాడి చేయించారు: షర్మిల 

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశా. ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ వైతెపా. ప్రజల కోసం కొట్లాడితే సీఎం కేసీఆర్‌, పోలీసులు ఇచ్చే బహుమానం దాడులా’’ అంటూ వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో, అంతకుముందు వరంగల్‌ జిల్లా శంకరాంతండాలోనూ ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజాప్రస్థానం పాదయాత్రకు ప్రజల స్పందన చూసి అధికార పార్టీ నాయకులు ఆందోళనతో దాడులకు దిగుతున్నారు. తెరాస కార్యకర్తలు మా కారవాన్‌కు నిప్పుపెట్టారు. మా కార్యకర్తలపై దాడులు చేశారు. మనుషులపైకి కార్లు పోనిచ్చారు. పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు. నన్ను కారవాన్‌లో నుంచి లాగి అరెస్టు చేశారు. దాడులు చేసిన దుండగులను మా కార్యకర్తలు పట్టించినా విడిచిపెట్టడం దుర్మార్గం. యాత్రను ఆపేదీ లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని