మూడున్నరేళ్లలో సేద్యానికి ఖర్చుపెట్టింది రూ.25 వేల కోట్లే

ఈ మూడున్నరేళ్లలో జగన్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఖర్చుపెట్టింది రూ.25 వేల కోట్లేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 29 Nov 2022 06:32 IST

మాజీ మంత్రి సోమిరెడ్డి ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ఈ మూడున్నరేళ్లలో జగన్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఖర్చుపెట్టింది రూ.25 వేల కోట్లేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీ రుణాల విషయంలో ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలేనని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే రాయితీ సొమ్మును కూడా జగన్‌ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెదేపా హయాంలో అసలు రైతు కడితే, వడ్డీ ప్రభుత్వం చెల్లించేదని... అదే జగన్‌ ప్రభుత్వంలో అసలుతో పాటు వడ్డీ కూడా రైతే కట్టాల్సి వస్తోందని సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘‘చంద్రబాబు హయాంలో 35 లక్షల మందికి సున్నా వడ్డీ రుణాలు వర్తింపజేస్తే.. ఈ ప్రభుత్వం అందులో నాలుగో వంతు మందికి కూడా లబ్ధి చేకూర్చలేదు. ధాన్యం కొనుగోలు కోసం రూ.48,793 కోట్లు, రైతులకు ఉచిత విద్యుత్తు కోసం రూ.27,800 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీ కింద రూ.2,647 కోట్లు ఖర్చు పెట్టామనడం పచ్చి అబద్ధం. ప్రతిపక్షంలో ఉండగా వ్యవసాయానికి 12 గంటలు ఉచిత విద్యుత్తు అందిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక 7 గంటలే ఇస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా నేటికీ చాలా మందికి బకాయిలు చెల్లించలేదు. సూక్ష్మ, బిందుసేద్యాన్ని అటకెక్కించారు. రైతు భరోసా పేరుతో జగన్‌ చేస్తోంది రైతు దగా. తెలంగాణలో రైతు బంధు కింద ఎకరాకు రూ.పది వేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తుంటే.. ఏపీలో కుటుంబానికి రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు...’’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని