సంక్షిప్త వార్తలు (8)

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ ఐక్యతారాగం ఆలపించారు.

Updated : 30 Nov 2022 06:46 IST

గహ్లోత్‌, పైలట్‌ ఐక్యతారాగం

జైపుర్‌: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ ఐక్యతారాగం ఆలపించారు. భారత్‌జోడో యాత్ర డిసెంబరు 4న రాజస్థాన్‌లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో వారిద్దరూ మంగళవారం దానికి సంబంధించిన ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాల్గొని చేతులు కలిపారు. తామిద్దరం కాంగ్రెస్‌ పార్టీకి విలువైన ఆస్తులమని రాహుల్‌గాంధీయే చెప్పినందువల్ల ఇక వివాదానికి తావే లేదనీ, అది ముగిసినట్లేనని గహ్లోత్‌ చెప్పారు.


బాబా రాందేవ్‌ ఆచితూచి మాట్లాడాలి: నారాయణ

ఈనాడు, హైదరాబాద్‌: మహిళలపై వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పిన బాబా రాందేవ్‌పై పదేపదే విమర్శలు చేయడం సబబు కాదని, భవిష్యత్తులో ఆయన ఆచితూచి మాట్లాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతటివారైనా.. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిందేనని, రాందేవ్‌ వ్యాఖ్యలు మహిళా లోకాన్ని బాధ పెట్టాయని నారాయణ పేర్కొన్నారు.


ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: తమ్మినేని

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా.. సానుకూలంగా స్పందించారని, చర్చలు జరిగి నెల రోజులు గడుస్తున్నా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆర్టీసీ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయడం, 2017, 2021 వేతన ఒప్పందాలను వెంటనే అమలు చేయడం, ఒప్పంద బకాయిలను తక్షణమే చెల్లించడం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల నుంచి వసూలు చేసిన రూ.850 కోట్లను సీసీఎస్‌కు తిరిగి చెల్లించడం వంటి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని కేసీఆర్‌కు మంగళవారం తమ్మినేని లేఖ రాశారు.


భూ సమస్యలపై నేడు కాంగ్రెస్‌ ధర్నాలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రైతులు, భూ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే నియోజకవర్గాలకు సమన్వయకర్తలను పీసీసీ నియమించింది. డిసెంబరు 5న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టి, కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు.


ఏఐటీయూసీ రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎండీ యూసిఫ్‌, ఎస్‌.బాలరాజు ఎన్నికయ్యారు. మంగళవారం యాదగిరిగుట్టలో జరిగిన ఆ సంఘం రాష్ట్ర సభ ముగింపు సమావేశంలో ప్రతినిధులు వీరిని ఎన్నుకున్నారు. ఉప ప్రధాన కార్యదర్శిగా ఎం.నర్సింహ, గౌరవాధ్యక్షుడిగా వాసిరెడ్డి సీతారామయ్యలు ఎన్నికయ్యారు.


‘పాలమూరు-రంగారెడ్డి’ అతీగతీ లేదు: తెదేపా

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని తెరాస ప్రభుత్వం చెప్పి ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదని తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు తెరాస, కాంగ్రెస్‌ కార్యకర్తలు మంగళవారం ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చి తెదేపాలో చేరారు. వారిని కాసాని, తెదేపా రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రామ్మోహనరావులు పార్టీలోకి ఆహ్వానించారు.


నారాయణ బెయిలు రద్దుపై తీర్పు వాయిదా

ఈనాడు, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిలును రద్దు చేస్తూ చిత్తూరు తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ప్రకటించారు. ఈనెల 30లోగా దిగువ కోర్టులో లొంగిపోవాలంటూ తొమ్మిదో అదనపు కోర్టు విధించిన గడువును.. ప్రస్తుత వ్యాజ్యంలో తీర్పు వెల్లడించేంత వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. బెయిలును రద్దు చేస్తూ చిత్తూరు తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.


రఘురామ విచారణ వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విచారణ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలంటూ సిట్‌ 26న ఆయనకు 41ఏ సీఆర్పీసీ నోటీస్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇతరత్రా కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్న కారణంగా విచారణను వాయిదా వేస్తున్నట్లు దర్యాప్తు అధికారి గంగాధర్‌ పేరిట ఎంపీకి మెయిల్‌ పంపించారు. 27వ తేదీనే ఈ మెయిల్‌ పంపించినట్లుగా ఉంది. విచారణకు రావాల్సిన అవసరం ఏర్పడితే సమాచారం అందిస్తామని అందులో పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయన మంగళవారం విచారణకు రాలేదని సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని