‘కచ్‌’ కుచ్‌ హోతాహై!

కచ్‌ అనగానే 2001 నాటి భారీ భూకంపం గుర్తుకొస్తుంది. ఆనాటి భయానక పరిస్థితులను సరిదిద్దిన ఫలితంగానే  ఈ జిల్లా భాజపాను ఆదరిస్తూ వస్తోంది.

Published : 30 Nov 2022 04:07 IST

ఆప్‌ రాకతో కచ్‌లో మారిన సమీకరణాలు

కచ్‌ అనగానే 2001 నాటి భారీ భూకంపం గుర్తుకొస్తుంది. ఆనాటి భయానక పరిస్థితులను సరిదిద్దిన ఫలితంగానే  ఈ జిల్లా భాజపాను ఆదరిస్తూ వస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాకతో అందరి మనసుల్లోనూ గుబులు మొదలైంది. ఈసారి కూడా కచ్‌ భాజపా పక్షాన్నే తీర్పునిస్తుందా లేక మనసు మార్చుకుంటుందా? అనేది చూడాలి.

పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకునే ఈ గుజరాత్‌ జిల్లాలో ఆరు నియోజకవర్గాలున్నాయి. అబ్దాసా, భుజ్‌, రాపార్‌లు పాకిస్థాన్‌తో నేరుగా సరిహద్దులున్నవి... మాండ్వి, అంజార్‌, గాంధీధామ్‌లు మిగిలిన మూడు. వీటన్నింటికీ తొలి విడతలోనే డిసెంబరు 1న ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 16 లక్షల మంది ఓటర్లున్న ఈ జిల్లాలో మహిళ, పురుష ఓటర్ల సంఖ్య దాదాపు సమానం. ముస్లింలు 19శాతం, దళితులు 12%, పటేళ్లు 10.5శాతం, క్షత్రియులు 6.5శాతం, కోలిలు 5శాతంపైగా ఉంటారు. ఇన్నాళ్లూ భాజపా, కాంగ్రెస్‌ల్లో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన ఓటర్లకు ఆప్‌ రూపంలో మరో బలమైన ప్రత్యామ్నాయం కనిపిస్తుండటంతో పోటీకి ఊపు వచ్చినట్లయింది. ఓటర్లలోనూ ఉత్సాహం కనిపిస్తోంది.

కమలం కోటే కానీ..

రెండు దశాబ్దాలుగా దళితులు, క్షత్రియులు, కోలిలు, రాజపూత్‌లు... కమలం పార్టీకి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. 2015 దాకా పటేళ్లు కూడా భాజపా వెనకాలే నిలిచారు. అందుకే కమలనాథులు కచ్‌లో అత్యధిక సీట్లను గెల్చుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో మాత్రమే పటేళ్లు భాజపాకు కాస్త దూరమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీలతో పాటు క్షత్రియులు, దళితులు, పటేళ్లలోని కొన్ని వర్గాలను నమ్ముకుంటోంది. ఈసారి కూడా ఆ పార్టీ పెద్దగా హడావుడి లేకుండా నిశ్శబ్దంగా ప్రచారం చేసుకుంటోంది. గత ఎన్నికల్లో రెండు సీట్లు సాధించిన తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉంది. ఆప్‌కు తోడు ఎంఐఎం కూడా రెండు సీట్లలో పోటీ చేస్తుండటంతో... తమ ఓట్లకు గండి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నారు.


ఆప్‌ రాకతో కలవరం

ఆమ్‌ ఆద్మీపార్టీ రాకతో కాంగ్రెస్‌లో కొంతమేరకు కలవరం కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో విద్య, వైద్యం, వెనకబాటుతనం, మంచినీటి సమస్య ప్రధాన అంశాలు. వీటి విషయంలో ఆప్‌ తన హామీలతో ఆకట్టుకుంటోంది. ఆప్‌ రాకతో కాంగ్రెస్‌ ఓట్లు చీలి తమకు మార్గం మరింత సుగమం అవుతుందనే ధీమా భాజపాలో వ్యక్తమవుతోంది. అయితే ఆప్‌ కేవలం కాంగ్రెస్‌ ఓట్లనే కాకుండా, తమ ఓట్లనూ చీల్చే అవకాశం ఉందనే భయం భాజపాలో కొంతమంది నేతలను వెంటాడుతోంది. ఎందుకంటే... ఇన్నాళ్లుగా చెబుతున్న అభివృద్ధి నినాదానికి భిన్నంగా... విద్య, వైద్యం, విద్యుత్తులపై ఆప్‌ ఇస్తున్న హామీలు ప్రజలను సూటిగా తాకుతున్నాయి. అయితే ఇవి ఓట్లుగా మారతాయా లేదా అనేది ఆసక్తికరం. ఉత్సాహం, హామీల సంగతి ఎలా ఉన్నా... భాజపా, కాంగ్రెస్‌లకున్నంత సంస్థాగత వ్యవస్థ, ఎన్నికల యంత్రాంగం ఆప్‌నకు లేవు.


భాజపాలో హస్తవాసి...!

చీలిన విపక్షం కంటే కూడా స్వపక్షంలో అసంతృప్తులు, తిరుగుబాట్లే తమకు ఎక్కువ ఇబ్బంది కల్గించే ప్రమాదం ఉందని భాజపా నేతలు అభిప్రాయపడుతున్నారు. చాలామటుకు సీట్లలో ఈసారి భాజపా తన వారిని కాదని కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరిన అభ్యర్థులకు సీట్లిచ్చింది. అబ్దాసాలో భాజపా అభ్యర్థి ప్రద్యుమ్న్‌సింగ్‌ జడేజా మొన్నటిదాకా కాంగ్రెస్‌లో ఉండి వచ్చిన వ్యక్తే. ఇది కార్యకర్తల్లో అసంతృప్తిని రగిలిస్తోంది. ఇక భుజ్‌ సీటులో అసెంబ్లీ స్పీకర్‌ నిమాబెన్‌ ఆచార్యను కాదని కేశూభాయ్‌ శివదాస్‌ పటేల్‌కు సీటిచ్చారు. దీంతో ఆచార్య వర్గం కినుక వహించింది. అంజార్‌, మాండ్విల్లోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు భాజపా టికెట్‌ ఇవ్వలేదు. మొత్తానికి... కచ్‌ ప్రాంతంలో... ఆప్‌ రాకతో ఎవరి ఓట్లను ఎవరెంతగా చీలుస్తారనే భయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో స్వల్ప ఓట్ల తేడా కూడా తలరాతను మారుస్తుందనే ఆందోళన అన్ని పార్టీల్లోనూ   కనిపిస్తోంది.

 ఈనాడు ప్రత్యేక విభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని