ఆన్‌లైన్‌లోనూ ప్రచార జోరు

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై గురిపెట్టిన భాజపా, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌).. తమ ప్రచార కార్యకలాపాల కోసం ఆన్‌లైన్‌ వేదికలనూ విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి.

Published : 30 Nov 2022 04:57 IST

గుజరాత్‌ ఎన్నికలపై ట్వీట్లు, ఫేస్‌బుక్‌ పోస్టుల్లో భాజపా, ఆప్‌ పోటాపోటీ

దిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై గురిపెట్టిన భాజపా, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌).. తమ ప్రచార కార్యకలాపాల కోసం ఆన్‌లైన్‌ వేదికలనూ విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ప్రధానంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో అధిక సంఖ్యలో పోస్టుల్ని పెడుతున్నాయి. ఈ మూడు ప్రధాన పార్టీలు ఈ నెల 21 నుంచి 27 వరకు సోషల్‌ మీడియాలోని తమ అధికారిక ఖాతాల్లో పెట్టిన పోస్టులను విశ్లేషిస్తే..

భాజపా  అత్యధికం ఎన్నికల గురించే

భాజపా ప్రధాన ఖాతాల నుంచి వెలువడిన ట్వీట్లు, ఫేస్‌బుక్‌ పోస్టుల్లో అత్యధికం గుజరాత్‌లో తమ పార్టీ ర్యాలీల వివరాలే ఉన్నాయి. ఆ పార్టీ చేసిన ట్వీట్లలో 40% పైగా, ఫేస్‌బుక్‌ పోస్టుల్లో 35% పైగా ఎన్నికల ప్రచారం గురించే కావడం గమనార్హం. భాజపా ప్రధాన ట్విటర్‌ ఖాతాను 1.95 కోట్ల మంది, పార్టీ ఫేస్‌బుక్‌ పేజీని 1.6 కోట్ల మంది అనుసరిస్తున్నారు.

కాంగ్రెస్‌  కాస్త వెనుకంజ

గుజరాత్‌ ఎన్నికల ప్రచారంతో పోలిస్తే తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్‌ జోడో యాత్రపైనే కాంగ్రెస్‌ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎక్కువగా దృష్టిపెడుతున్నట్లు కనిపిస్తోంది! హస్తం పార్టీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో చేసిన ట్వీట్లలో కేవలం 15 శాతమే గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించినవి ఉన్నాయి. పార్టీ ఫేస్‌బుక్‌ పేజీలోని పోస్టుల్లోనూ వాటి వాటా 22 శాతమే కావడం గమనార్హం. అదే సమయంలో మొత్తంగా పార్టీ ట్విటర్‌, ఫేస్‌బుక్‌ల్లో పెట్టిన పోస్టుల్లో 75%.. జోడో యాత్రకు సంబంధించినవి ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ ట్విటర్‌ హ్యాండిల్‌ను 90 లక్షల మంది, ఫేస్‌బుక్‌ పేజీని 63 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

ఆప్‌  సగం వాటా వాటిదే

గుజరాత్‌ ఎన్నికల విషయంలో సామాజిక మాధ్యమాల్లోనూ ఆప్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. ఆ పార్టీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో చేసిన ట్వీట్లలో 50%, ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టిన పోస్టుల్లో 52%.. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించినవే. ఆప్‌ హ్యాండిల్‌ను ట్విటర్‌లో 64 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 55 లక్షల మంది అనుసరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని