తల్లీకుమారుల ఆత్మహత్యాయత్నానికి వైకాపా వేధింపులే కారణం

వైకాపా నాయకుల వేధింపుల వల్లే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో తల్లీకుమారులు కోటిపల్లి కామాక్షి, మురళీకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

Published : 30 Nov 2022 04:57 IST

డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ఈనాడు, అమరావతి: వైకాపా నాయకుల వేధింపుల వల్లే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో తల్లీకుమారులు కోటిపల్లి కామాక్షి, మురళీకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కామాక్షి మృతి చెందగా, మురళీకృష్ణ వైద్యం పొందుతున్నారని మంగళవారం డీజీపీకి రాసిన లేఖలో వివరించారు. సంఘటన జరిగి 15 రోజులు కావస్తున్నా ఇప్పటివరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ‘బలభద్రపురంలోని తోటపేటలో ఉన్న రెండు సెంట్ల స్థలంలో 40 ఏళ్లుగా తల్లీకుమారులు నివసిస్తున్నారు. నిబంధనల మేరకు ఇంటిపన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారు. వీరి ఇంటి పక్కనే ఉన్న 48 సెంట్ల భూమిని వైకాపా నేత కిలపర్తి వీర్రాజు ఆక్రమించి లేఅవుట్‌ ప్రారంభించారు. దాని కోసమే స్థానిక అధికారులతో కలిసి కుట్ర చేసి కామాక్షి, మురళీకృష్ణలను స్థలం నుంచి గెంటేశారు’ అని వివరించారు. ‘వైకాపా స్థానిక నాయకులు బాదిరెడ్డి అప్పారావు, యామన దుర్గారావు, బాదిరెడ్డి భీమన్న, వీర్రాజు వారిని బెదిరించారు. అధికారుల అండతో ఖాళీ చేయించారు. నిస్సహాయ స్థితిలో తల్లీకుమారులు విషం తాగారు. తమ ఆత్మహత్యకు కారణమెవరో సెల్ఫీ వీడియో ద్వారా వివరించారు’ అని తెలిపారు.

* అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సర్పంచులు ఐక్యంగా చేస్తున్న పోరాటంలో తప్పేముందని చంద్రబాబు ప్రశ్నించారు. ‘అలిపిరి నుంచి తిరుమల వరకు మెట్లమార్గంలో నడుచుకుంటూ వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్న సర్పంచులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నా’ అని పేర్కొన్నారు.


‘ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి’ ప్రారంభం నేడు

తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో బుధవారం ‘ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో రోడ్డుషోలు నిర్వహిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని