జనసేన నేత ఫోన్‌ను తీసుకెళ్లిన పోలీసులు

తిరుపతి జనసేన నేత కిరణ్‌ రాయల్‌ను ఈ నెల 11న పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను నగరి పోలీసులు సోమవారం అనధికారికంగా న్యాయస్థానం నుంచే తీసుకెళ్లారు.

Published : 30 Nov 2022 04:57 IST

చిత్తూరు జిల్లా నగరి కోర్టులో ఘటన

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు; న్యూస్‌టుడే, నగరి: తిరుపతి జనసేన నేత కిరణ్‌ రాయల్‌ను ఈ నెల 11న పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను నగరి పోలీసులు సోమవారం అనధికారికంగా న్యాయస్థానం నుంచే తీసుకెళ్లారు. ఒక రోజు ఆలస్యంగా మంగళవారం ఇది వెలుగులోకి వచ్చింది. దీనికి బాధ్యులైన చిత్తూరు జిల్లా నగరి సీఐ శ్రీనివాసంతి, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టు సూపరింటెండెంట్‌ ద్వారా ప్రాపర్టీ క్లర్క్‌ నగరి జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ విష్ణువర్మకు విన్నవించారు. దీనిపై సమాధానమివ్వడానికి న్యాయస్థానం ముందు హాజరవ్వాలని తాను సీఐను కోరగా ఆమె నిరాకరిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారని సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత సెల్‌ఫోన్‌లోని సమాచారాన్ని సేకరిస్తే కోర్టు కానిస్టేబుల్‌, సీఐనే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేజిస్ట్రేట్‌ విష్ణువర్మ ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారని చెప్పారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగం నేపథ్యంలో తిరుపతి జనసేన నేత కిరణ్‌ రాయల్‌తో పాటు 11 మందిపై నగరి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో కిరణ్‌ రాయల్‌ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను   మంగళగిరిలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపాలని నగరి అర్బన్‌ ఎస్సై సోమవారం ఉదయం 10.15 గంటలకు కోర్టుకు లేఖ ఇచ్చారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించినందున తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సెల్‌ఫోన్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపకుండా ఆదేశాలు ఇవ్వాలని కిరణ్‌ తరఫు న్యాయవాదులు కంచి శ్యామల, ఆర్‌.శ్రీహరి మెమో దాఖలు చేయగా మేజిస్ట్రేట్‌ విష్ణువర్మ అంగీకరించారు. అప్పటివరకూ ప్రాపర్టీ క్లర్క్‌ అధీనంలో ఉంచాలని ఆదేశించారు. అయితే... లంచ్‌అవర్‌లో అకస్మాత్తుగా కోర్టు కానిస్టేబుల్‌ న్యాయస్థానంలో ఉన్న ఆ సెల్‌ఫోన్‌ను అనధికారికంగా తీసుకెళ్లారు. ఇది గమనించిన ప్రాపర్టీ క్లర్క్‌ ఈ విషయాన్ని మేజిస్ట్రేట్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టు అనుమతితోనే ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపుతున్నాం: సీఐ

కిరణ్‌ రాయల్‌ కేసుకు సంబంధించి అతని సెల్‌ఫోన్‌ కోర్టుకు అప్పగించామని, కోర్టు అనుమతితోనే ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరీక్షలకు పంపుతున్నామని నగరి సీఐ శ్రీనివాసంతి వివరణ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి సోమవారం అనుమతి పొందామని, కోర్టు ద్వారానే కేసుకు సంబంధించిన వస్తువులు సేకరించామని చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని