ప్రాజెక్టులు కట్టరు.. పరిశ్రమలు పెట్టరు

ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టూ కట్టలేదని, ఒక్క పరిశ్రమా పెట్టలేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు.

Updated : 30 Nov 2022 06:44 IST

ముఖ్యమంత్రి అసమర్థ పాలనపై ప్రజల్లోకి..
డిసెంబరు 12 నుంచి క్షేత్రస్థాయి సందర్శన
రాయలసీమ తెదేపా నేతల వెల్లడి

ఈనాడు, తిరుపతి: ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టూ కట్టలేదని, ఒక్క పరిశ్రమా పెట్టలేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులకు రూ.10వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తే.. ఇప్పుడు కేవలం రూ.2700 కోట్లే వెచ్చించినట్లు వెల్లడించారు. ఇదే విధంగా నిధులు ఖర్చు చేస్తే ప్రాజెక్టుల పూర్తికి ఎన్ని వందల ఏళ్లు పడుతుందని ప్రశ్నించారు. మంగళవారం రేణిగుంటలో తెదేపా రాయలసీమ జోనల్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెదేపా చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించామని, ఈ సమావేశంలో 30 తీర్మానాలు చేశామని చెప్పారు. ‘జగన్‌ అసమర్థతకు ప్రతిరూపాలైన ప్రాజెక్టుల సందర్శనతోపాటు చంద్రబాబు దీక్షాదక్షతలను తెలియజేసేలా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేపట్టనున్నాం. ఇందుకోసం 12న వేదావతి ప్రాజెక్టును సందర్శించనున్నాం. ఆ తర్వాత వివిధ ప్రాజెక్టులను పరిశీలించనున్నాం’ అని వెల్లడించారు. సొంత బాబాయి హత్య కేసును పక్క రాష్ట్రానికి బదలాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నైతికతతో ముఖ్యమంత్రి జగన్‌ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు.

ప్రభుత్వంపై పోరాటానికి శ్రీకారం

‘అనంతపురం నుంచి అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేను పులివెందుల- అమరావతి కింద మార్చారు. సీమ అంటే మీరు, మీ కుటుంబమేనా? ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ పోరాటం చేస్తాం’ అని పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. కేంద్రాన్ని నోరు తెరిచి అడగలేని సీఎం ప్రజలకు ఏం మేలు చేస్తారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో తిరుపతి రైల్వేస్టేషన్‌, విమానాశ్రయం, మన్నవరం తదితర ప్రాజెక్టులన్నీ కుంటుపడ్డాయని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. సీమలోని ఒక్క ప్రాజెక్టు పనీ పూర్తి చేయలేదని, కడప స్టీల్‌ ప్లాంటుకు కనీసం ప్రహరీ కట్టలేదని మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని