వివేకా హత్య కేసులో జగన్‌ను విచారించాలి

మాజీమంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని సాక్షిగా విచారిస్తే కేసు త్వరగా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 30 Nov 2022 05:33 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: మాజీమంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని సాక్షిగా విచారిస్తే కేసు త్వరగా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వివేకా హత్యానంతరం జగన్‌ మాట్లాడిన మాటలను ఆయన ప్రదర్శించారు. వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేయడం హర్షణీయ పరిణామమన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులపై రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేయడంతోనే కేసు విచారణలో జాప్యం జరిగిందన్నారు. ఈ కేసు విచారణలో హైదరాబాద్‌లో కూడా కొన్ని అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నా అంతిమంగా న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. వివేకా హత్యానంతరం ఆయన గుండెపోటుతో మరణించారని మీడియాకు చెప్పిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని, హత్య కేసులో అనుమానితుడిగా పేర్కొన్న ఎంపీ అవినాశ్‌రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకి రఘురామ సూచించారు. డాక్టర్‌ సునీత ప్రజాజీవితంలోకి వస్తే బాగుంటుందని సూచించారు.

అన్నింటిపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు

రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేస్తే ప్రభుత్వం కోరుకున్నట్లు అన్నింటిపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని ఎంపీ రఘురామ తెలిపారు. ‘తీర్పును సమగ్రంగా పరిశీలిస్తే రాజధాని ఏర్పాటుపై శాసనసభకు అధికారాన్ని కోరుతూ స్టే ఇవ్వాలని కోరగా సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర రాజధాని ఏర్పాటు పార్లమెంటు పరిధిలోని వ్యవహారమని, పార్లమెంటుకే ఆ హక్కులు ఉన్నాయని తేల్చిచెప్పింది’ అన్నారు.

* ఆచంట నియోజకవర్గానికి చెందిన వేణుబాబు అనే వ్యక్తి తన పీఏనని ప్రచారం చేసుకుంటుండగా అతడిపై ఫిర్యాదును స్వీకరించేందుకు ఎస్సై, సీఐ విముఖత చూపారని రఘురామ వెల్లడించారు. దాంతో ఎస్పీకి ఫిర్యాదు చేయాలని సూచించానన్నారు. ఎంపీ ఇచ్చే ఫిర్యాదు తాము స్వీకరించబోమని, ఆయనపై ఎవరైనా ఫిర్యాదు ఇస్తే స్వీకరిస్తామని ఎస్సై తమ సిబ్బందికి తెలపడంపై రఘురామ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని