తెలంగాణ వనరులను దోచుకున్న ఘనత వైఎస్‌ కుటుంబానిది: బాల్కసుమన్‌

షర్మిల సంస్కార హీనంగా మాట్లాడుతూ అడుగడుక్కీ తెలంగాణను అవమానించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ విమర్శించారు.

Updated : 01 Dec 2022 08:51 IST

షర్మిల భాష మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలని హెచ్చరిక

ఈనాడు, హైదరాబాద్‌: షర్మిల సంస్కార హీనంగా మాట్లాడుతూ అడుగడుక్కీ తెలంగాణను అవమానించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ విమర్శించారు. తెలంగాణ వాదాన్ని ఉగ్రవాదంతో పోలుస్తూ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వనరులను దోచుకున్న ఘనత వైఎస్‌ కుటుంబానిదని, నాడు మానుకోటలో జగన్‌ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్న చరిత్రను షర్మిల మర్చిపోవద్దన్నారు. షర్మిల తన భాష మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. బుధవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌ పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని షర్మిల సందర్భం వచ్చినప్పుడల్లా బయటపెడుతున్నారు. ఆ రోజు మీరు తిరిగి వచ్చి ఉంటే రాష్ట్రం ముక్కలయ్యేది కాదు రాజన్నా అంటూ ఆమె గతంలో ట్వీట్‌ చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని షర్మిల, ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌ బయ్యారం గనులు కొల్లగొట్టాలని ప్రయత్నించారు. కిరాయి మనుషుల తోలుబొమ్మలాటలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరంలేదు’’ అని తెలిపారు. కవిత ఇంటిపై దాడి జరిగితే రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఏమాత్రం స్పందించలేదు. షర్మిల గురించి ఆందోళన వ్యక్తంచేయడం ద్వారా వైతెపాకు భాజపా మద్దతు బయటపడింది’’ అని సుమన్‌ వ్యాఖ్యానించారు.

‘మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారో మీ అన్నను అడుగు..’

వైఎస్‌ షర్మిల తెలంగాణలో విషపు బీజాలు నాటడానికి ప్రయత్నిస్తున్నారని, కుట్రలు చేస్తూ రాష్ట్రాన్ని ఆగం చేయాలని పాదయాత్ర చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత  ధ్వజమెత్తారు. ఆనాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకించి.. నేడు ఇక్కడి ఆడబిడ్డనని అనడం హాస్యాస్పదమన్నారు. బుధవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.‘‘ తెలంగాణ అభివృద్ధి షర్మిలకు ఇష్టం లేదు. ఆమె ఓదార్పు యాత్రలు ఏపీకి అవసరం. అక్కడికి వెళ్తే మంచిది. ఇక్కడ ఏ లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నారో ఆమెకే తెలియాలి. నర్సంపేటలో షర్మిలను అడ్డుకున్నది మహిళలే అని గుర్తించాలి. తెరాసపై మానసిక దాడి చేస్తున్నారు. దీన్ని చూస్తూ ఎలా ఉండాలి? మీ కుటుంబం  మొత్తం తెలంగాణ వ్యతిరేకులే. మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారో మీ అన్నను అడుగు’’ అని సునీత, కవితలు ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు