రాష్ట్రాన్ని అప్పులకుంపటిగా మార్చారు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రాష్ట్రాల మాదిరే చూస్తోందని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

Published : 01 Dec 2022 03:27 IST

సీఎం కేసీఆర్‌పై ఈటల ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రాష్ట్రాల మాదిరే చూస్తోందని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని బదనాం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఎక్కువ ఊహించుకొని ఆ తర్వాత కేంద్రం నిధులు తగ్గించిందని అనడం శుద్ధతప్పని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆర్థిక మంత్రిని పంపించాలని సవాలు విసిరారు. బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరల పెరుగుదల సూచీలో తెలంగాణ రెండోస్థానంలో ఉందని, ప్రజల పైసలతో తెరాస ప్రభుత్వం ఓట్లు కొనుగోలు చేస్తోందని విమర్శించారు.

పుట్టే ప్రతి బిడ్డపై రూ.1.20 లక్షల అప్పు

‘‘తెలంగాణ ఆవిర్భవించినప్పుడు రాష్ట్ర అప్పు జీఎస్‌డీపీలో 15-16 శాతం ఉంటే ఇప్పుడు 28 శాతానికిపైగా చేరింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కూడా అతిక్రమించారు. పుట్టే ప్రతిబిడ్డపైనా రూ.1.20 లక్షల అప్పు భారాన్ని తెరాస ప్రభుత్వం వేస్తోంది. రాష్ట్రాన్ని అప్పులకుంపటిగా మార్చారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించట్లేదు. గుజరాత్‌పై తెరాస విమర్శల్లో వాస్తవం లేదు. ఆ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, ఆదాయం చాలా తక్కువ. తెలంగాణలో మద్యం అమ్మకాలతో ప్రభుత్వం ఏడాదికి రూ.45 వేల కోట్ల ఆదాయాన్ని రాబడుతోంది. కేసీఆర్‌ మోసపు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొడతారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో మట్టికరిపిస్తాం’’ అని ఈటల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని