ప్రజలను దోచుకోవడానికే ఆ పార్టీల రాజకీయం

ఆధిపత్య వర్గాల చేతిలో చిక్కుకున్న తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు దోచుకోవడానికే రాజకీయం చేస్తున్నాయని, ప్రజలకు మేలు చేసే చిత్తశుద్ధి వాటికి లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

Published : 01 Dec 2022 03:27 IST

తెరాస, భాజపా, కాంగ్రెస్‌లపై ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ విమర్శ

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ఆధిపత్య వర్గాల చేతిలో చిక్కుకున్న తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు దోచుకోవడానికే రాజకీయం చేస్తున్నాయని, ప్రజలకు మేలు చేసే చిత్తశుద్ధి వాటికి లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. వికారాబాద్‌లో బీఎస్పీ జిల్లా కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.   ‘‘అగ్రవర్ణ పేదలకు అడ్డదారిలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన భాజపా.. బీసీల రిజర్వేషన్లు తగ్గించింది. శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్న తెరాస ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు తగ్గించి, 50 శాతం మాత్రమే అమలు చేస్తూ తీరని ద్రోహం చేస్తోంది. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి’’ అని డిమాండ్‌ చేశారు.

ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ పావులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల దిశగా పావులు కదుపుతున్నారని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించినా తెరాస గెలవలేని పరిస్థితి ఏర్పడిందని, వామపక్షాల మద్దతుతోనే విజయం సాధించిందని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భైంసాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, వాటిని ఖండిస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్‌ తెరాస ఎమ్మెల్యే ఆనంద్‌తో ఉన్న బంధుత్వాన్ని విలేకరులు ప్రస్తావించగా, ఎవరి రాజకీయం వారిదేనని ప్రవీణ్‌కుమార్‌ బదులిచ్చారు. అంతకుముందు ఆలంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఎన్టీఆర్‌ చౌరస్తాలోని బీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని