కాంగ్రెస్‌ను నష్టపరిచేందుకే భాజపా, తెరాస, షర్మిల డ్రామా

భాజపా, తెరాస, షర్మిల వ్యవహారం.. అంతా రాజకీయ డ్రామా అని, అది కాంగ్రెస్‌ను దెబ్బతీయటానికేనని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

Published : 01 Dec 2022 03:27 IST

- ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: భాజపా, తెరాస, షర్మిల వ్యవహారం.. అంతా రాజకీయ డ్రామా అని, అది కాంగ్రెస్‌ను దెబ్బతీయటానికేనని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియాహాలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వేచ్ఛగా ఎవరైనా పోరాటం చేయొచ్చు, షర్మిల పాదయాత్రను అడ్డుకోవడం సరికాదని, ఆమెపై దాడి, అరెస్టులను ఖండిస్తున్నానని ఆయన చెప్పారు.  బండి సంజయ్‌ ఎప్పుడైనా ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా అని నిలదీశారు. తెరాస వ్యతిరేక ఓటు బ్యాంకును కొంత భాజపా, షర్మిల పార్టీలు చీల్చాలని చూస్తున్నాయని.. తద్వారా పరోక్షంగా తెరాసకు అనుకూలించే కుట్ర రాజకీయం జరుగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు.

బతుకమ్మ, వంటా వార్పుతో తెలంగాణ రాలే: మహేష్‌కుమార్‌గౌడ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ కవిత పుట్టక ముందే మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేశారని, ఇందిరాగాంధీ బతుకమ్మ కూడా ఆడారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ వాళ్లు అంతా ద్రోహులు అనేలా కవిత ట్వీట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడారు. బతుకమ్మ, వంటా వార్పు చేస్తే తెలంగాణ వచ్చిందని కవిత అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ దయవల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకోవాలన్నారు.


ఖర్గేతో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి భేటీ

ఈనాడు, దిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం దిల్లీలోని ఖర్గే నివాసానికి చేరుకుని పలు అంశాలు చర్చించారు. మునుగోడు ఉపఎన్నిక ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ఆయన.. అక్కడ పని చేసిన తీరు, పార్టీపరంగా కష్టపడిన విధానం, లోటుపాట్లు తదితరాలపై ఖర్గేకు నివేదిక అందజేశారు. ఇన్‌ఛార్జుల నివేదిక ఆధారంగా నూతన కార్యవర్గంలో పదవులు దక్కుతాయని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని