కీలక పదవుల్లో ఒకే కులం.. ఒకే జిల్లా వారు

‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాజిక న్యాయాన్ని పాటించాను. కానీ వైకాపా నేతలు నా కులానికే ప్రాధాన్యం ఇచ్చానని దుష్ప్రచారం చేశారు.

Updated : 01 Dec 2022 05:52 IST

చింతలపూడి సభలో చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాజిక న్యాయాన్ని పాటించాను. కానీ వైకాపా నేతలు నా కులానికే ప్రాధాన్యం ఇచ్చానని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం చేస్తున్నదేంటి? ముఖ్యమైన పదవుల్లో ఒక సామాజికవర్గం వారే ఉన్నారు కదా? సీఎం సహా డీజీపీ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సకల శాఖల మంత్రి.. ఇలా కీలక పదవుల్లో ఒకే కులం వారు.. పైగా ఒకే జిల్లాకు చెందినవారినే నియమించారు. నాపై అప్పట్లో ఆరోపణలు చేసిన వారు.. ముక్కును నేలకేసి రాయాలి’ అని చంద్రబాబు డిమాండు చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి సభలో బుధవారం రాత్రి ఆయన మాట్లాడారు.

నల్ల చున్నీలంటే భయం ఎందుకు?

‘నాకు పోలీసు రక్షణ లేకపోయినా స్వేచ్ఛగా ప్రజల్లో తిరుగుతున్నా. జగన్‌ మాత్రం పరదాల మాటున భయం భయంగా వెళ్తున్నారు. సభలకు మహిళలు నల్ల చున్నీలు వేసుకొస్తే తిప్పి పంపుతున్నారు. సభలోకి వచ్చే వారి ఒంటిపైనున్న చున్నీలను పోలీసులు లాగేస్తున్నారు. ఇదేం సభ్యత? నల్ల చున్నీలంటే ఎందుకంతగా భయపడుతున్నావు జగన్‌? దమ్ముంటే.. నాలా స్వేచ్ఛగా జనాల్లో తిరుగు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?’ అని ప్రశ్నించారు.

అందరూ సైకిల్‌ ఎక్కాలి

‘రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అందరూ సైకిల్‌ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. సైకిల్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ సైకిల్‌ కూడా వచ్చేసింది. ఫ్యాన్‌ను నమ్ముకుంటే లాభం లేదు’ అన్నారు.

* చింతలపూడి సభలో చంద్రబాబు జనాలతో నినాదాలు చేయించారు. ఇదేం ఖర్మ అని.. బాబు అనగానే ప్రజలు మన రాష్ట్రానికి అంటూ నినదించారు.

* ధర్మాజీగూడెంలో విద్యార్థులతో ముఖాముఖి ముగిశాక రోడ్‌షో ప్రారంభమవుతుండగా ఐదు నిమిషాల పాటు విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అయినా చీకట్లోనే వాహనశ్రేణి ముందుకు సాగింది.

చంద్రబాబుకు వ్యతిరేకంగా వైకాపా నినాదాలు

బాబు పర్యటనలో వైకాపా శ్రేణులు నిరసన తెలిపాయి. ధర్మాజీగూడెంలో వైకాపా నాయకులు నినాదాలు చేయగా, పోలీసులు వారిని పక్కకు లాగేశారు. చింతలపూడిలో సభ ముగించుకుని చంద్రబాబు వెళ్తుండగా.. ఆయన కాన్వాయ్‌ను వైకాపా నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభలో స్థానిక ఎమ్మెల్యే, ఆయన సోదరుడిపై చంద్రబాబు ఆరోపణలు చేయడంతో వారు నినాదాలు చేశారు. అనంతరం వారు రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని