సంక్షిప్త వార్తలు (11)

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబం మద్యం కుంభకోణంలో నిండా మునిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

Updated : 02 Dec 2022 07:03 IST

లిక్కర్‌ స్కాంలో నిండా మునిగిన తెరాస: బీఎస్పీ

అలంపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబం మద్యం కుంభకోణంలో నిండా మునిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను పెంచాలని, లేకపోతే ఓట్ల కోసం రావద్దని బండి సంజయ్‌కు సవాల్‌ విసిరారు.


పరస్పర సహకారంతోనే పొత్తులు: కూనంనేని

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పర సహకారంతోనే పొత్తులు ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సీపీఐ పాలేరు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం ఖమ్మం గ్రామీణ మండలం నాయుడుపేటలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. పొత్తులకు ఏ పార్టీ కలిసి రాకపోతే సీపీఐ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పాటుగా పాలేరు నియోజకవర్గంలోనూ పోటీ చేసి గెలుస్తుందన్నారు. భాజపాను ఓడించేందుకు మునుగోడు ఉప ఎన్నికలో తెరాసతో పొత్తు పెట్టుకున్నామని, ఆ పొత్తు మునుగోడు వరకేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నట్లు వివరించారు.


ముంపు మండలాలను విస్మరించిన ప్రభుత్వం  
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ముంపు మండలాల ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల వరద బాధితులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన కరకట్టే భద్రాచలాన్ని కాపాడిందని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో గురువారం మహబూబాబాద్‌, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాల్లోని పినపాక, హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ.. పోడు భూములతో పాటు గిరిజనులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వాటి సాధన కోసం ఆందోళనలు చేపట్టాలని సూచించారు. కష్టపడి పనిచేసే వారిని పార్టీ గుర్తిస్తుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని చెప్పారు.


జగన్‌ అక్రమాలు బయటపడతాయనే అడ్డంకులు

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ప్రభుత్వ వైఫల్యాలు, జగన్‌రెడ్డి అక్రమాలు బయటపడతాయనే తెదేపా అధినేత చంద్రబాబును పోలవరం వెళ్లకుండా అడ్డుకున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ‘‘పోలవరం ఏమైనా నిషేధిత ప్రాంతమా? చంద్రబాబును ఎందుకు అడ్డుకున్నారు? ప్రతిపక్ష నాయకుడ్ని అడ్డుకోవడం ముమ్మాటికీ అసమర్థపాలనే.  పోలవరం జాతీయ ప్రాజెక్టు. దేశంలో ఎవరికైనా దాన్ని సందర్శించే హక్కు ఉంది. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కమీషన్లు దండుకోవడం తప్ప జగన్‌ సాధించిన పురోగతి ఏంటి?...’’ అని యనమల గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.


పోలవరం పాకిస్థాన్‌లో ఉందా?

చింతకాయల విజయ్‌, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఈనాడు డిజిటల్‌, అమరావతి : పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకోవడం దారుణమని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ పేర్కొన్నారు. ‘పోలవరం ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా? గతంలో విశాఖపట్నంలో రుషికొండపై జరుగుతున్న తవ్వకాలను పరిశీలిస్తామంటే కూడా ఇలానే అడ్డుకున్నారు...’’ అని ఆయన పేర్కొన్నారు.


చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం తగదు

శ్రీరామ్‌ చినబాబు, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రివర్స్‌ టెండరింగ్‌లో కొట్టేసిన రూ.వేల కోట్ల గుట్టు బయటపడుతుందనే భయంతో పోలవరానికి వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత తిన్న ప్రతి రూపాయి కక్కిస్తామని, పోలీసులను అడ్డుపెట్టుకొని ఎక్కువ కాలం అరాచకాలు చేయలేరన్నారు.


పోలవరానికి నిధులిచ్చింది మోదీనే

భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ‘‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రంలోని పార్టీలు కేవలం శంకుస్థాపనలు, పిల్లకాలువలు తవ్వడం తప్ప చేసింది శూన్యం. మోదీ రూ.17 వేల కోట్లకు పైగా నిధులిచ్చి రైతాంగానికి న్యాయం చేస్తుంటే... వీళ్ల గొడవేంటో...’’ అని గురువారం సత్యకుమార్‌ ట్వీట్‌ చేశారు.


కాంగ్రెస్‌ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలి

హైకోర్టును ఆశ్రయించిన రాజస్థాన్‌ భాజపా నేత

జైపుర్‌: రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ మద్దతుదారులైన 90 మందికి పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాల విషయంలో ఓ నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌కు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ప్రతిపక్ష భాజపా డిప్యూటీ నేత రాజేంద్ర రాథోడ్‌ గురువారం హైకోర్టును ఆశ్రయించారు. జాబితాలోని పేర్లను బహిర్గతం చేసి, సభా కార్యక్రమాల్లో వారు పాల్గొనకుండా నిరోధించాలని కోరారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అశోక్‌ గహ్లోత్‌ వారసుడి ఎంపిక కోసం ఏర్పాటుచేసిన సీఎల్పీ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్‌ 25న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ సీపీ జోషికి రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే.


కేజ్రీవాల్‌తో ఎన్నికల ప్రచారంలో హర్బజన్‌ సింగ్‌

అహ్మదాబాద్‌: క్రికెటర్‌ నుంచి రాజకీయ నేతగా మారిన హర్బజన్‌ సింగ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున గురువారం గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌లతో కలిసి పలు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 8న గుజరాత్‌లో రెండో దశ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


7 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

కుప్పం, న్యూస్‌టుడే: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 7, 8, 9 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆరో తేదీన మంగళవారం దిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకోనున్న చంద్రబాబు రాత్రికి అక్కడే బస చేస్తారు. 7న రోడ్డు మార్గం ద్వారా కోలార్‌, కేజీఎఫ్‌ మీదుగా శాంతిపురం మండలానికి చేరుకుంటారు.


భూములను దోచుకున్న తెదేపా నేతలు: మంత్రి ధర్మాన

అరసవల్లి, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో కొందరు తెదేపా నాయకులు రాష్ట్రంలోని భూములు, చెరువులను దోచుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన భూహక్కు పత్రాలను యజమానులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘చంద్రబాబునాయుడు అమరావతి రాజధాని అని ప్రకటించి ఆ ప్రాంతం చుట్టూ బంధువులతో స్థలాలను కొనిపించేశారు. ఇప్పుడు కొందరు బ్రోకర్లు తయారై బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ అంటూ తిరుగుతున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలని చూస్తున్నారు. రోడ్లు బాగోలేవంటున్నారు. మేము అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లే అయ్యింది. వారేసినవే ఇప్పుడు పాడయ్యాయి’ అని పేర్కొన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు