గుజరాత్‌లో తొలివిడత 60 శాతం.. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని దక్షిణ గుజరాత్‌, సౌరాష్ట్ర - కచ్‌ ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలివిడత కింద గురువారం జరిగిన పోలింగు ప్రశాంతంగా ముగిసింది.

Updated : 02 Dec 2022 06:51 IST

అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని దక్షిణ గుజరాత్‌, సౌరాష్ట్ర - కచ్‌ ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలివిడత కింద గురువారం జరిగిన పోలింగు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8.00 గంటలకు మొదలైన పోలింగు సాయంత్రం 5.00 గంటలు దాటినా కొనసాగింది. అయిదింటి వరకు అందిన వివరాల మేరకు 60.23 శాతం సగటు ఓటింగు నమోదైంది. కొన్ని పోలింగ్‌ స్టేషన్ల సమాచారం ఇంకా అందలేదని, పోస్టల్‌ బాలెట్లను కలపాల్సి ఉందని ఈసీ తెలిపింది. గిరిజనులు అధికంగా ఉన్న తాపీ జిల్లాలో అత్యధికంగా 72.32 శాతం పోలింగు నమోదైంది. 2.39 కోట్ల ఓటర్లున్న 89 శాసనసభ స్థానాల్లోని 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి.  కొన్ని పోలింగు కేంద్రాల్లో ఈవీఎంలు  మొరాయించడంతో పోలింగు కాసేపు ఆగి, తర్వాత కొనసాగింది.

పోలింగు కేంద్రాలకు గ్యాస్‌ సిలిండర్లు

ధరల పెరుగుదలకు నిరసనగా కొంతమంది ఓటర్లు వంటగ్యాస్‌ సిలిండర్లతో పోలింగు కేంద్రాలకు వచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పరేశ్‌ ధనానీ సైతం అమ్రేలి పోలింగ్‌ స్టేషనుకు సైకిలుపై గ్యాస్‌ సిలిండరుతో వచ్చారు. బోటాద్‌ జిల్లాలో ఓ పెళ్లిబృందం బ్యాండ్‌బాజాతో ఓటేసేందుకు వచ్చింది. మారుమూల ఉన్న గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని ఉనా నియోజకవర్గంలో భాగమైన అటవీప్రాంత బనేజ్‌ పోలింగు కేంద్రంలో ఒక్క ఓటు కోసం ఈసీ పోలింగు బూత్‌ ఏర్పాటు చేసింది. మహంత్‌ హరిదాస్‌జీ ఉదాసీన్‌ తన ఓటుహక్కు వినియోగించుకోవడంతో ఈ కేంద్రంలో వందశాతం పోలింగు నమోదైంది.

ఓటేసిన ఆఫ్రికా జాతి ప్రజలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద పశువైద్యం

గుజరాత్‌లో మినీ ఆఫ్రికాగా పేరొందిన జంబూర్‌ గ్రామస్థులు తొలిసారిగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరి ముందు తరాలవారు జునాగఢ్‌ కోట నిర్మాణ సమయంలో పనుల కోసం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. మరోవైపు.. ఓటింగు శాతాన్ని పెంచేలా పోలింగు కేంద్రాల వద్ద ప్రయోగాత్మకంగా యానిమల్‌ బూత్‌లను ఈసీ ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో ఉన్న వైద్యబృందం ఓటర్లు వెంట తెచ్చిన పశువులకు చికిత్స అందించింది. సూరత్‌లో 89 ఏళ్లు పైబడిన ఓటర్లు 62,037 మంది ఉండగా.. వీరు ఉత్సాహంగా పోలింగులో పాల్గొన్నారు. వివిధ కారణాలతో మూడు గ్రామాల ప్రజలు ఓటింగును బహిష్కరించినట్లు ఈసీ తెలిపింది. కొన్నిచోట్ల బూత్‌లు ఆక్రమించి బోగస్‌ ఓటింగుకు పాల్పడ్డారని, రెండోవిడత ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోదీ ర్యాలీల ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటుచేసి భాజపా నేతలు నిబంధనలు అతిక్రమించారని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఆరు ఫిర్యాదులు చేసింది. పోలింగు అనంతరం ఈవీఎంల తరలింపులో.. విధుల నిర్వహణకు వచ్చిన త్రిపుర స్టేట్‌ రైఫిల్స్‌ సిబ్బందిని దూరంగా పెట్టిన గుజరాత్‌ పోలీసుల పాత్రపైనా దర్యాప్తు జరపాలని కోరింది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు