భాజపావి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు

భాజపా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు తెలంగాణలో నడవవని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 02 Dec 2022 03:45 IST

అవి తెలంగాణ గడ్డపై నడవవు
కుట్రలకు భయపడం: మంత్రి హరీశ్‌రావు

జగిత్యాల, న్యూస్‌టుడే: భాజపా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు తెలంగాణలో నడవవని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికలు వస్తే చాలు ఈడీలు, ఐటీలు దిగుతాయని ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే అక్కడ దాడులు చేయిస్తారని విమర్శించారు. ఈనెల 7న  జగిత్యాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తున్న నేపథ్యంలో గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘భాజపా పెట్టించే పార్టీలు, వదిలిన బాణాలు, కుట్రలు ఎన్నెన్నో. అవి ఉత్తర్‌ప్రదేశ్‌లోనో, బిహార్‌లోనో నడిచాయి. ఉద్యమాల గడ్డమీద నడవవు. భాజపా కుట్రలకు భయపడేది లేదు. బండి సంజయ్‌ తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు. భాజపా ఎన్ని కుతంత్రాలు చేసినా తెరాస... తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి చూసి మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని రెండుమూడు తాలూకాల సర్పంచులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసి తమ ప్రాంతాలను తెలంగాణలో కలపమని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి అభివృద్ధి పక్క రాష్ట్రాలకు కనిపిస్తుంటే భాజపా నాయకులకు మాత్రం కనబడట్లేదు.

ఎనిమిదేళ్ల పాలనలో కేంద్రం రూ.కోటి కోట్ల అప్పు

కేంద్ర ప్రభుత్వం దేశప్రజల మీద నెలకు రూ.లక్ష కోట్ల అప్పు వేస్తోంది. ఈ ఎనిమిదేళ్ల పాలనలో రూ.కోటి కోట్ల అప్పు చేసి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి చర్చకు వస్తా. ఈ సవాల్‌కు సిద్ధమా? నీతి ఆయోగ్‌ సిఫార్సులను కేంద్రం బుట్టదాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక సహాయ గ్రాంట్‌ రూ.1,350 కోట్లు, స్థానిక సంస్థల అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ.817 కోట్లు, ఎస్సీ, ఎస్టీ పథకానికి వాటా కింద 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ.6,268 కోట్లు తీసుకురావాలి. జీఎస్టీ కింద రాష్ట్రం కేంద్రానికి రూ.30 వేల కోట్లు ఇస్తే... కేంద్రం కేవలం రూ.8 వేల కోట్లు తిరిగి ఇచ్చింది. పన్నుల వాటా 42 శాతానికి పెంచామని అబద్ధాలు చెబుతున్నారు. కేవలం 29.6 శాతం ఇస్తున్నారు. అనేక పథకాలు రద్దు చేసి రాష్ట్రానికి రూ.వేల కోట్లు రాకుండా చేస్తున్నారు. దమ్ముంటే రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లు తీసుకువచ్చి మాట్లాడాలి’’ అని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఎంతోకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో తెరాస జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, సుంకె రవిశంకర్‌, చెన్నమనేని రమేష్‌బాబు, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, టి.భానుప్రసాద్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని