దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మోదీ

ఆర్థిక అసమానతలు, సామాజిక శత్రుత్వం, రాజకీయ నియంతృత్వం సృష్టించి.. దేశాన్ని విభజించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది.

Published : 02 Dec 2022 04:23 IST

దాన్ని అడ్డుకునేందుకే భారత్‌ జోడో యాత్ర: కాంగ్రెస్‌

నజర్‌పుర్‌ (మధ్యప్రదేశ్‌): ఆర్థిక అసమానతలు, సామాజిక శత్రుత్వం, రాజకీయ నియంతృత్వం సృష్టించి.. దేశాన్ని విభజించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. దీన్ని నిరోధించే ఏకైక లక్ష్యంతోనే తాము రాహుల్‌గాంధీ నేతృత్వంలో భారత్‌ జోడో యాత్ర ప్రారంభించామని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ అన్నారు. యాత్రలో భాగంగా ఉజ్జయిని జిల్లాలోని నజర్‌పుర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత్‌ జోడో యాత్ర ఈ నెల 24న దిల్లీ చేరుకుంటుందని, అక్కడ యాత్రకు ఐదురోజులు విరామం ఇస్తామని చెప్పారు. గురువారం రాహుల్‌ గాంధీ పాదయాత్రలో నటి స్వరభాస్కర్‌ పాల్గొన్నారు. భారత జోడో యాత్రలో 1000 పుస్తకాలతో సంచార గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భాజపా తగ్గించకపోవడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గత ఆరు నెలల్లో ముడిచమురు ధర 25% కంటే ఎక్కువే తగ్గింది. దేశంలోని పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.10 వరకు తగ్గించొచ్చు. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. ప్రజలు అధిక ధరలకు అల్లాడుతుంటే ప్రధానమంత్రి మాత్రం హాయిగా దోపిడీ కొనసాగిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

మోదీ రోజూ 4 కిలోల తిట్లు తిడుతున్నారు: ఖర్గే

వడోదరా: ప్రధానమంత్రి మోదీ.. రోజూ తమ పార్టీని ఉద్దేశించి 4 కిలోల తిట్లు వాడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అయన వడోదరా జిల్లాలో ఓ ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలు తనను దూషించడంలో పోటీ పడుతున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.‘‘కాంగ్రెస్‌ రోజూ రెండు కిలోల తిట్లు తిడుతోందని మోదీ అంటారు. వాస్తవమేంటంటే ఆయనే మమ్మల్ని మా పార్టీని, సోనియా గాంధీని, రాహుల్‌ను నాలుగు కిలోల తిట్లు తిడుతున్నారు’’ అని పేర్కొన్నారు.


జోడో యాత్రతో చచ్చిపోతున్నాం!
కమల్‌నాథ్‌ వీడియో వైరల్‌

  భోపాల్‌:  ‘భారత్‌ జోడో యాత్ర’ కఠిన షెడ్యూల్‌పై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ అసహనం ప్రదర్శిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో కమల్‌నాథ్‌.. ప్రదీప్‌ మిశ్ర అనే పండితుడితో మాట్లాడుతూ.. ‘‘గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నాం. దాంట్లో రెండు నిబంధనలుంటాయి. రోజూ ఉదయం 6 గంటలకే యాత్ర ప్రారంభించాలి. రోజుకు కనీసం 24 కిలోమీటర్లు నడవాలి’’ అని పేర్కొన్నారు. అంతేగాక, మధ్యప్రదేశ్‌లో ఆదివాసీ వీరుడు తాంత్య భిల్‌ జన్మస్థలం, ఓంకారేశ్వర, ఉజ్జయిని మహంకాళీ ఆలయాలను సందర్శించాలని రాహుల్‌ షరతు పెట్టారని కమల్‌నాథ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు