పోలవరం నా ప్రాణం... పూర్తి చేసే బాధ్యత నాదే

‘పోలవరం నా ప్రాణం. నేను పెంచిన బిడ్డ. దాన్ని ప్రయోజకురాలిగా తీర్చిదిద్దే బాధ్యత నాది’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ‘ఇదేం ఖర్మ... మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు గురువారం ఏలూరు జిల్లా పోలవరంలో ఆయన పర్యటన కొనసాగింది. ప్రాజెక్టును పరిశీలించేందుకు సిద్ధమైన ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Updated : 02 Dec 2022 07:59 IST

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హామీ
ప్రాజెక్టును పరిశీలించేందుకు అనుమతించని పోలీసులు
అరగంట సేపు రోడ్డుపై బైఠాయించిన తెదేపా అధినేత
పోలవరంలో తీవ్ర ఉద్రిక్తత

ఈనాడు ఏలూరు - న్యూస్‌టుడే, పోలవరం, కొయ్యలగూడెం గ్రామీణం: ‘పోలవరం నా ప్రాణం. నేను పెంచిన బిడ్డ. దాన్ని ప్రయోజకురాలిగా తీర్చిదిద్దే బాధ్యత నాది’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ‘ఇదేం ఖర్మ... మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు గురువారం ఏలూరు జిల్లా పోలవరంలో ఆయన పర్యటన కొనసాగింది. ప్రాజెక్టును పరిశీలించేందుకు సిద్ధమైన ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. నాయకులతో కలిసి దాదాపు అరగంట సేపు నేలపై కూర్చునే నిరసన తెలిపారు. కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండటంతో వారిని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సముదాయించారు. పోలీసులు... ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో ఉదయం నుంచి బారికేడ్లు ఏర్పాటుచేసి, ట్రాలీలను అడ్డుగా పెట్టారు. సాయంత్రం 5.50 గంటలకు చంద్రబాబు వచ్చే సమయానికి వాహనాలను అడ్డుగా పెట్టడంతో తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. చంద్రబాబుతోపాటు అయిదుగురు నాయకులను అనుమతించాలని కోరినా పోలీసులు అంగీకరించలేదు. చివరికి డీఎస్పీ స్వయంగా వచ్చి మాట్లాడటంతో తెదేపా అధినేత నిరసన విరమించారు. తర్వాత అక్కడే ప్రచార రథంపైకి ఎక్కిన చంద్రబాబు... ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘పోలవరం ఆంధ్రప్రదేశ్‌ 70 ఏళ్ల కోరిక. రాష్ట్ర ప్రజల జీవనాడి. దీన్ని పూర్తిచేసి నదుల అనుసంధానం చేస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు, కుడి ప్రధాన కాలువ ద్వారా కర్నూలు జిల్లా బనకచర్ల వరకు సాగునీరు అందించవచ్చని ప్రణాళికలు రూపొందించా’ అని వివరించారు.

నా శ్రమను జగన్‌ నాశనం చేశారు

‘పోలవరం పూర్తి కావాలంటే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయాలని, అలా చేస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని నేను ఆనాడు కేంద్రాన్ని పట్టుబడితే ఆర్డినెన్స్‌ ఇచ్చారు. సమస్యను ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు అర్థం చేసుకుని సహకరించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మాణానికి ఎంతైతే అంత చెల్లించేలా చట్టం చేశాం. జగన్‌రెడ్డి అధికారం చేపట్టాక పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) వద్దని సూచించినా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లారు. నేను 72% పనులు చేస్తే... ఇప్పుడన్నీ నాశనం చేసి, గోదావరిలో కలిపేస్తూ ప్రజల ఆశలను చంపేస్తున్నారు. తెదేపా మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాదే. రైతులు చింతలపూడి ఎత్తిపోతల పథకం కావాలని అడిగితే రూ.280 కోట్లతో మంజూరు చేశా. వైకాపా అధికారంలోకి వచ్చాక అది మూలనపడింది. దీనిపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలి. పోలవరం ప్రాజెక్టుతో కొందరికి మేలు జరిగితే... కొందరు భూములు, ఇళ్లను కోల్పోయారు. అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అధికారంలోకి వచ్చాక ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్‌... అమలు చేయడంలేదు. నేను అధికారంలోకి వచ్చాక మెరుగైన ప్యాకేజీతోపాటు పోలవరం ప్రభావిత మండలాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తా.

మోటార్లకు మీటర్లు.. రైతులకు ఉరితాళ్లు

ఎన్టీఆర్‌ వ్యవసాయ మోటార్లకు మీటర్లను తొలగిస్తే... ఇప్పుడు జగన్‌ వచ్చాక మళ్లీ బిగిస్తున్నారు. ఇదేమని అడిగితే... రైతులు అభ్యంతరం చెప్పడం లేదంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారు. ఇప్పుడు భయపడితే ఆ మీటర్లే రైతుల పాలిట ఉరితాళ్లుగా మారుతాయి. మీరంతా ప్రశ్నించండి... నేను మీ వెంట ఉంటా’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

నేనే ఓ మెట్టు దిగా..!

ప్రాజెక్టు సందర్శనను అడ్డుకోవడంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ‘చట్టంపై గౌరవం ఉండటంతోనే పోలీసుల మాటకు విలువిచ్చి ఒక మెట్టు దిగా. నేను తలచుకుంటే బలవంతంగా వెళ్లడం పెద్ద పని కాదు’ అని అన్నారు. ఏమంటారు తమ్ముళ్లూ? అని కార్యకర్తలను ప్రశ్నించగా... వారంతా చేతులెత్తి, పిడికిళ్లు బిగించి మద్దతు పలికారు. ఏమ్మా! ప్రాజెక్టు సందర్శనకు ఎప్పుడు రావాలో చెప్పండని డీఎస్పీ లతా కుమారిని చంద్రబాబు ప్రశ్నించారు. జలవనరుల శాఖ నుంచి అనుమతి తెచ్చుకుంటే అభ్యంతరం లేదని ఆమె వివరించారు. దీంతో.. మళ్లీ వస్తా పోలవరానికి అంటూ చంద్రబాబు ప్రసంగాన్ని ముగించారు. చట్ట ప్రకారమే నడుచుకుంటామని చెప్పినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

సైకో రెడ్డిని ఇంటికి పంపుదాం...

గురువారం రెండోరోజు ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన మాజీ ఎంపీ మాగంటి బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొరగం శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో సాగింది. కొయ్యలగూడెంలో ఆయన మాట్లాడుతూ... అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి సైకో రెడ్డిని ఇంటికి పంపించి... రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. కొయ్యలగూడెంలో కొందరు వైకాపా నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెదేపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా శ్రేణులూ రెట్టించి నినదించడంతో ఆ ప్రాంతం హోరెత్తింది. కొందరు అరటిగెలలను తెచ్చి పండ్లను విసురుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రెండువర్గాల మధ్య ఉన్నారే తప్ప, రెచ్చగొడుతున్న వైకాపా కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు