సంక్షిప్త వార్తలు(4)

జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎవరి ఆస్తులకూ రక్షణ లేకుండాపోయిందని, తాజాగా విశాఖపట్నం, సిరిపురంలోని సీబీసీఎన్సీ చర్చి స్థలాన్ని కొట్టేయడానికి వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

Updated : 03 Dec 2022 06:40 IST

సీబీసీఎన్సీ చర్చి స్థలానికి ఎసరుపెట్టిన వైకాపా నేతలు: వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి : జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎవరి ఆస్తులకూ రక్షణ లేకుండాపోయిందని, తాజాగా విశాఖపట్నం, సిరిపురంలోని సీబీసీఎన్సీ చర్చి స్థలాన్ని కొట్టేయడానికి వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మాయమాటలతో క్రైస్తవుల ఓట్లు దండుకున్న జగన్‌రెడ్డి నేడు వారి ప్రార్థనా స్థలాన్ని ఆక్రమిస్తుంటే చోద్యం చూస్తున్నారని ఓ ప్రకటనలో మండిపడ్డారు. సీఎం దగ్గర్నుంచి వైకాపాలో సాధారణ కార్యకర్త వరకు భూకబ్జాలు, దోపిడీల వంటి చర్యలకు దిగుతున్నారు.


జగన్‌ ‘బీసీ ద్రోహి’
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బీసీల పదవులు, నిధులు దోచేసి... రిజర్వేషన్లు కోసేసిన బీసీ ద్రోహి జగన్‌రెడ్డికి బీసీల పేరెత్తే అర్హత లేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. పదవులన్నీ సొంత సామాజికవర్గానికి కట్టబెట్టి వెనకబడిన తరగతులకు జగన్‌మోసపురెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ‘‘బీసీలకు కన్నతల్లి తెదేపా అయితే.. సవతి తల్లి వైకాపా. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచే తెదేపా కార్యక్రమం ‘జయహో బీసీ’ పేరూ ఎత్తుకుపోయారు...’’ అని అయ్యన్నపాత్రుడు శుక్రవారం ట్వీట్‌ చేశారు. వైకాపా నేతలు విడుదల చేసిన ‘జయహో బీసీ మహాసభ’ పోస్టర్‌ను, గతంలో తెదేపా నిర్వహించిన ‘జయహో బీసీ’ కార్యక్రమానికి సంబంధించిన  పోస్టర్‌లను తన ట్వీట్‌కు జత చేశారు.


5 నుంచి భాజపా కీలక సమావేశాలు..

దిల్లీ: సోమవారం(డిసెంబరు 5) నుంచి దిల్లీలో రెండు రోజుల పాటు భాజపా కీలక సమావేశాలను నిర్వహించనుంది. దేశం నలుమూలల నుంచి పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారు. వచ్చే ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధతపై సమీక్షించనున్నట్టు తెలుస్తోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగే ఈ సమావేశాల్లో పార్టీ సంస్థాగత విషయాలతో పాటు భారత్‌కు జీ20 అధ్యక్ష బాధ్యతలు, ప్రపంచ మందగమనం నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పార్టీ అగ్రనేతలతో పాటు అన్ని రాష్ట్రాల భాజపా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.


కాంగ్రెస్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకుల సమావేశం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: పార్టీ బలోపేతం కోసం అన్ని వర్గాలు కలిసి వచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు నిర్ణయించారు. ఆయా వర్గాల నాయకులు అద్దంకి దయాకర్‌, రాములు నాయక్‌, కత్తి వెంకటస్వామి, రియాజ్‌ మహ్మద్‌, జమున రాథోడ్‌, జనక్‌ ప్రసాద్‌, జి.శ్రీనివాస్‌, తదితరులు శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాత పది జిల్లాల్లో బహిరంగ సభలు, నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని