ప్రకృతి వనరుల దోపిడీకి పథక రచన

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకృతి వనరుల దోపిడీకి పథక రచన చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.

Published : 03 Dec 2022 04:14 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

చిల్లకూరు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకృతి వనరుల దోపిడీకి పథక రచన చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో సిలికా అక్రమ తవ్వకాలపై శుక్రవారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘చెన్నై వ్యాపారి చెప్పిందే శాసనం’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. మైనింగ్‌ కార్యకలాపాలు జరుగుతున్న బల్లవోలు, చింతవరం తదితర గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘చనిపోయిన వారి పేర్ల మీద భూముల్లో సిలికా తవ్వకాలకు అనుమతులు తెచ్చుకునేందుకు స్థానిక వైకాపా నాయకులు పావులు కదుపుతూ కీలకపాత్ర పోషిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే తవ్వకాలు జరిపి ఇతర రాష్ట్రాలకు సిలికాను వందలాది లారీల్లో ఎగుమతి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు, భూగర్భ గనుల శాఖ అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారా? డంపింగ్‌ యార్డుల పేరిట అనుమతులు పొంది 36 వేల టన్నుల ఖనిజాన్ని నిల్వ చేయాల్సి ఉండగా, లక్ష నుంచి లక్షా యాభై వేల టన్నులు నిల్వ చేసి ఖనిజ సంపద దోపిడీకి తెగబడుతున్నారు. ప్రభుత్వానికి నామమాత్రంగా టన్నుకు రూ.360 రాయల్టీ చెల్లించి రూ.800కు విక్రయిస్తున్నారు. తద్వారా జే ట్యాక్స్‌ రూపేణా నెలకు రూ.8 కోట్లతో మొదలైన ఆదాయం రూ.14 కోట్లకు చేరింది...’ అని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించి అక్రమాలను అడ్డుకోకపోతే భాజపా ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని సోము వీర్రాజు హెచ్చరించారు. మోమిడి రెవెన్యూ పరిధిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై పునుగుంటపాలెం వాసులు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు, తిరుపతి జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని