‘గర్జన’ జనసమీకరణకు అడ్డదారులు

కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఈ నెల 5న సోమవారం జరిగే సీమ గర్జన సభను వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జన సమీకరణకు అడ్డదారుల్లో ప్రయత్నిస్తోంది.

Published : 03 Dec 2022 04:14 IST

విద్యార్థులనూ పంపాలని ప్రైవేటు విద్యాసంస్థలకు మౌఖిక ఆదేశాలు
కర్నూలులో సభ విజయవంతానికి వైకాపా యత్నాలు

ఈనాడు-కర్నూలు, ఈనాడు డిజిటల్‌- అనంతపురం: కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఈ నెల 5న సోమవారం జరిగే సీమ గర్జన సభను వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జన సమీకరణకు అడ్డదారుల్లో ప్రయత్నిస్తోంది. సభకు లక్ష మందిని సమీకరించాలన్న పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో వైకాపా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన విజయవంతమవ్వడం, ఒకే రాజధానికి ప్రజలు ముక్తకంఠంతో ఆమోదం తెలిపినందున.. ఇక్కడే మూడు రాజధానుల స్వరాన్ని వినిపించాలని అధికార పార్టీ తలపోస్తోంది. ఈ దిశలో స్వయానా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు సాగుతున్నాయి. సభ నిర్వహించే ఎస్టీబీసీ మైదానం సామర్థ్యం 25-30 వేల వరకు ఉంటుందని అంచనా. ప్రాంగణం కిక్కిరిస్తే లక్ష మంది వచ్చారని ఆర్భాటంగా చెప్పుకోవచ్చని దీన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను భారీగా సమీకరించాలని నిర్ణయించారు. తదనుగుణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రైవేటు విద్యాలయాల యాజమాన్యాలతో మాట్లాడి సభకు విద్యార్థులను తప్పనిసరిగా పంపించాలంటూ మౌఖికంగా ఆదేశాలనిస్తున్నారు. దీన్ని మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోదరుడు సతీష్‌ పర్యవేక్షిస్తున్నారని సమాచారం. సరిహద్దులో ఉన్న ఉమ్మడి కడప, అనంతపురం జిల్లాల విద్యాలయాలనుంచీ సమీకరిస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల బస్సులకు మరమ్మతు ఏమైనా ఉంటే ముందే చేయించాలని, ఆదివారం సాయంత్రంలోగా సమీపంలోని రవాణా శాఖ కార్యాలయాల వద్ద పెట్టాలనే ఆదేశాలందాయి. సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించాలని యాజమాన్యాలను మౌఖికంగా ఆదేశించారు. గుంతకల్లు, గుత్తి, ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులకు ఈ తరహా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. బస్సులను సొంత ఖర్చులతో తరలించాలన్న నేతల ఆదేశాలతో యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. కార్యకర్తలు, ఇతరులు, విద్యార్థులను తరలించేందుకు ఆయా మండల నాయకులకు ఇప్పటికే రూట్‌మ్యాప్‌ అందించినట్లు సమాచారం. సభలో 3 రాజధానులకు అనుకూలంగా ఎక్కువ మందితో జై కొట్టించేందుకు వైకాపా నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

పరీక్షల మాటేంటి?

6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌-2 పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 7వ తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్షలను వాయిదా వేసే అవకాశం లేదు. గర్జన కోసం వెళ్లి బస్సులు అందుబాటులో లేకపోతే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం కష్టమవుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక విద్యాసంస్థల నిర్వాహకులు అయోమయంలో పడ్డారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు