కార్పొరేషన్ల ద్వారా పైసా రుణం ఇవ్వలేదు

బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు మూడున్నరేళ్లలో పైసా రుణం కూడా ఇవ్వని దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని, రాష్ట్రంలో కార్పొరేషన్లు నాలుక గీసుకోవడానికి తప్ప, వాటివల్ల ప్రజలకు ఏ ప్రయోజనం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Updated : 03 Dec 2022 06:38 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు మూడున్నరేళ్లలో పైసా రుణం కూడా ఇవ్వని దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని, రాష్ట్రంలో కార్పొరేషన్లు నాలుక గీసుకోవడానికి తప్ప, వాటివల్ల ప్రజలకు ఏ ప్రయోజనం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రలో శుక్రవారం జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘జయహో బీసీ’ అని తెదేపా పెట్టిన పేరును వైకాపా ఎలా పెట్టుకుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు విద్యాదీవెన పేరుతో కోతపెట్టి ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకొంటున్నారని, ఈ పథకంలో తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో పైసా మిగలదని చెప్పారు. పాతపనుల పైనే రంగులు వేసి, పేర్లు మార్చి స్టిక్కరింగ్‌ చేస్తున్న ముఖ్యమంత్రి, స్టిక్కర్‌ ముఖ్యమంత్రి అని విమర్శించారు. ప్రతి మహిళ ఆర్థికమంత్రిగా వ్యవహరించాలని సూచించారు. వైకాపా గెలిచే పరిస్థితి లేదని తెలిసి, ప్రాంతీయవాదం రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

ధైర్యం లేక పరదాలు కట్టుకుంటున్నారు: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

సారవకోట: ముఖ్యమంత్రికి ప్రజల వద్దకు వెళ్లే ధైర్యం లేకపోవడం వల్లే రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా దారి పొడవునా పరదాలు కట్టుకుంటున్నారని, అక్కడినుంచి వచ్చి ప్యాలెస్‌లో పిల్లిలా పడుకుంటున్నారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి కూడలిలో శుక్రవారం జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన అంతమొందించడానికి ప్రజలు నడుం బిగించాలన్నారు. రాష్ట్రంలో 22 మంది వైకాపా ఎంపీలున్నా, ఒక్కరైనా రాష్ట్రం కోసం కేంద్రంలో పోరాడుతున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీపై బహిరంగ విచారణకు వైకాపా నాయకులు వస్తారా అని సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు.

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని అడ్డుకున్న వైకాపా

సోమల: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని ఉప్పరపల్లె పంచాయతీలో తెదేపా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైన ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమం నిలిచిపోయింది. కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు అడ్డుకోగా ఇందుకు పోలీసులు వత్తాసు పలకడం విశేషం. అధిష్ఠానం పిలుపు మేరకు.. కమ్మపల్లె, చీకలవారిపల్లె, చిన్నఉప్పరపల్లె, ఇర్లపల్లె గ్రామాల్లో.. ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు అక్కడికి వచ్చి ప్రభుత్వ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని, తెదేపా ఈ కార్యక్రమం నిర్వహించరాదని వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఇన్‌ఛార్జి ఎస్సై మారుతి అక్కడికి వచ్చి సబ్‌డివిజన్‌ పరిధిలో 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉందని, అనుమతి తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని తెదేపా నాయకులకు సూచించారు. దీంతో వారు కార్యక్రమాన్ని నిలిపేసి వెళ్లిపోయారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు