జగన్‌ ప్రభుత్వాన్ని స్తంభింపజేయండి

‘ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధపడకుంటే ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు.

Published : 03 Dec 2022 04:14 IST

వచ్చే ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించండి
నిడదవోలు ‘ఇదేం ఖర్మ... మన రాష్ట్రానికి’ సభలో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం: ‘ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధపడకుంటే ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ని చిత్తుచిత్తుగా ఓడించకుంటే... బంగాళాఖాతంలో కలపకుంటే... రాష్ట్రంలో ఎవరినీ ఉండనివ్వడు. మా మతస్థుడనో, మా కులస్థుడనో... మీరు ఆలోచిస్తే పెద్ద ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే. రాష్ట్ర ప్రభుత్వం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరూ నిలదీయండి. నిరంతర పోరాటాలతో ప్రభుత్వాన్ని స్తంభింపజేయండి. మీకు అండగా నేను పోరాడతా’ అని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోడ్‌ షోలో పాల్గొన్న చంద్రబాబు నిడదవోలు బహిరంగ సభలో ప్రసంగించారు.

పారిశ్రామికవేత్తలు పారిపోయే దుస్థితి

‘పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి భయపడి పారిపోయే దుస్థితిని వైకాపా నేతలు తీసుకొచ్చారు. ఏపీకి చెందిన అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమ రూ.9,500 కోట్ల పెట్టుబడితో తెలంగాణకు వెళ్లిపోయింది. అమరరాజాకు రాజశేఖరరెడ్డి భూమి ఇస్తే.. ఆయన కొడుకు జగన్‌.. కంపెనీని సాగనంపుతున్నారు. తెదేపా హయాంలో ఒప్పందాలు జరిగిన రూ.16 వేల కోట్ల పెట్టుబడులన్నీ వచ్చి ఉంటే... రాష్ట్రంలో 30 లక్షల మందికి ఉద్యోగాలు దక్కేవి. నారాయణ సంస్థల అధిపతినీ బెదిరించి కేసులు పెట్టారు. బీసీలపై ప్రేమ అంటూనే... అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడులను కేసులతో ఇబ్బంది పెట్టారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్న నాపైనా దాడి చేస్తున్నారు. రాష్ట్రం నాశనమవుతుంటే కాపాడుకునే బాధ్యత నాపై ఉంది. అందుకే పోరాటం చేస్తున్నా. వివేకా హత్య కేసులో పోరాడి సుప్రీంకోర్టు వరకు వెళ్లి మరీ, తెలంగాణకు బదిలీ చేయించుకున్న సునీత తెగువను... ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ప్రదర్శించాలి.

ఇదేం ఖర్మ అంటున్నారు...

సర్పంచులు నిధుల్లేక బాధపడుతున్నారు. వాళ్లే చీపుళ్లు పట్టుకుని రోడ్లు ఊడ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఉత్తర్వులు ఇచ్చారు. రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడం లేదు. ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరిస్తున్నారు. తీవ్రవాదులను, మత విద్వేషాలను, రౌడీయిజాన్ని, ముఠాలను కట్టడి చేసిన పోలీసులే... ప్రభుత్వానికి బెదిరి గోడలు దూకే పరిస్థితి వచ్చింది. చెయ్యని తప్పులకు జనం శిక్ష అనుభవిస్తున్నారు. ఇదేం ఖర్మని బాధపడుతున్న ప్రజలు ఈసారి అదే తప్పు మళ్లీ చెయ్యవద్దు. కొత్తకొత్త మద్యం బ్రాండ్ల తయారీ అంతా జగన్‌ చేతుల్లోనే ఉంటోంది. తయారీ వాళ్లదే.. సరఫరా వాళ్లదే.. పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఫోన్‌ పోయిందని ఫిర్యాదు ఇచ్చేదీ వారే. ఏ2 విజయసాయిరెడ్డి ఫోన్‌ పోయిందని ఎందుకు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫోన్‌ను పోలీసులు కనిపెట్టారా? దీనిపై డీజీపీ ఎందుకు విచారణ చేయడంలేదు’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

అడుగడుగునా జననీరాజనం

కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో రెండురోజులు సాగిన చంద్రబాబు పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం కొవ్వూరు నుంచి బయలుదేరి రోడ్డుషో నిడదవోలు వరకు సాగింది. గ్రామాల్లో హారతులు పడుతూ, పూలు జల్లుతూ... బాణాసంచా కాలుస్తూ చంద్రబాబుకు స్వాగతం పలికారు. నిడదవోలులో సాగిన రోడ్డు షోలో వేలాదిగా ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త బూరుగుపల్లి శేషారావు, నాయకులు కుందుల వీరవెంకట సత్యనారాయణ, యండపల్లి దొరయ్య, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కేఎస్‌ జవహర్‌, పీతల సుజాత, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, నాయకులు తోట సీతారామలక్ష్మి, ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


ఆ స్ఫూర్తి నన్ను కదిలించింది

మహిళా సాధికారత, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో సమావేశానికి చంద్రబాబు వస్తుండగా... వేదిక చెంతనే ఓ దివ్యాంగుడు కనిపించారు. ఆయన చెప్పేది వినేందుకు వీలుగా చంద్రబాబు కింద కూర్చున్నారు. తాళ్లపూడి మండలం పెద్దేవానికి చెందిన శ్రీనివాస్‌కు పోలియో సోకిందనీ, కొన్నేళ్లుగా తెదేపా కార్యకర్తగా ఎంతో శ్రమిస్తున్నారని స్థానిక నేతలు చెప్పారు. ‘దివ్యాంగుడైనా తెదేపా పటిష్ఠానికి చేస్తున్న అతని సంకల్పం, స్ఫూర్తి నన్ను కదిలించింది.  ఆయనకు పార్టీ తరపున సహాయం చేస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.


ఈ సీఎం మాకొద్దు
విజయకుమారి, కడియం

మీరు నా మాట ఆలకిస్తే రుణమాఫీ ఇస్తానన్నాడు. అందరికీ వచ్చాయా? అమ్మఒడి అందరికీ వచ్చిందా... హామీలు నెరవేర్చారా? పెన్షన్‌ ఇస్తుంటే.. చెత్తమీద డబ్బులు... కుళాయి మీద డబ్బులు.. నీటిమీద డబ్బులు... మీకు డబ్బులిస్తున్నాం. కదా కరెంటు బిల్లు పెంచాం అంటున్నారు... ఇంటి పన్ను పెంచాం.. చెత్త పన్ను వేశామనే సీఎం మాకొద్దు. ఈసారి ఓటుతో బుద్ధిచెప్పే సమయం వచ్చింది.


రావణ రాజ్యం పోవాలి.. రామరాజ్యం రావాలి
తాడేపల్లిగూడెం బహిరంగ సభలో చంద్రబాబు నిప్పులు

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, తాడేపల్లిగూడెం: ‘ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెదేపాకు కంచుకోట. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆదరిస్తున్నారు. ఇప్పుడు మీ అందరి ఉత్సాహం చూస్తుంటే జగన్‌రెడ్డిని ఇంటికి పంపించి... వచ్చే ఎన్నికల్లో 2014 ఫలితాలు పునరావృతం చేస్తారనే నమ్మకం కలిగింది’ అని తాడేపల్లిగూడెం బహిరంగ సభలో తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. ఆయన శుక్రవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం, పట్టణ పరిధిలో పర్యటించారు. నవాబ్‌పాలెంలో రైతులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తాడేపల్లిగూడెంలో ప్రసంగిస్తూ... ‘జగన్‌రెడ్డి అధికారం చేపట్టాక రోడ్లను అభివృద్ధి చేయలేదు. వీటిపై కొత్త పథకం ప్రవేశపెడతారు. దానికి ‘ఉయ్యాల బాట.. గుంతలే గుంతలు’ అని పేరు పెడతారేమో. ఈ రోడ్లపై ప్రయాణిస్తుంటే నాకు నడుం నొప్పి వచ్చింది.. మరో నాలుగు రోజులు తిరిగితే ఈ జిల్లాలోనే ఏదో ఒక ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. హెలికాప్టర్‌లో కాదు. రోడ్లపై తిరిగితే వాస్తవాలు తెలుస్తాóు. మా హయాంలో వేసిన రోడ్లపై పాదయాత్ర చేసి ఎన్ని కథలు చెప్పావు జగన్‌. ఇప్పుడు కిలో మీటరుకు 100 గుంతలు ఉన్నాయి. వాటిల్లో జగన్‌ ప్రభుత్వాన్ని పూడ్చేసే పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది.

చిలక‘కొట్టు’ సర్దుకోవాల్సిందే

జిల్లాలో మంత్రి చిలక‘కొట్టు’ సత్యనారాయణ ఆగడాలు పెరిగిపోయాయి. ఆయన పెడుతున్న బాధలను భరించలేక ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఆయన ‘కొట్టు’ సర్దుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఎవరైనా లేఔట్‌ వేస్తే ఎకరాకు రూ.10 లక్షలు, వాణిజ్య సముదాయం కడితే రూ.కోటి ఇవ్వాలని బెదిరింపులు, మార్కెట్‌లో 400 గజాల స్థలం ఆక్రమణ ఇలా... చిట్టా చదువుతుంటే ఇంతలా సంపాదించవచ్చా? అని అనిపిస్తోంది. తెదేపా హయాంలో తప్పులు చేసేందుకు నాయకులు భయపడేవారు. తెదేపా నాయకులు ఇలా చేస్తే ఇక్కడే సెట్‌ చేసేవాడిని’ అని చంద్రబాబు స్పష్టంచేశారు.

‘బాబు’కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా అనేకచోట్ల వైకాపా నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ వద్ద కొందరు నల్లబెలూన్లు ఎగురవేసేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు