మోదీ ఇంట కమలానికి పరీక్ష!

గుజరాత్‌లోని  ఉంఝా నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కారణం- ప్రధాని మోదీ స్వస్థలం వాద్‌నగర్‌ ఈ స్థానం పరిధిలోనే ఉంది.

Updated : 03 Dec 2022 10:06 IST

అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఉంఝా స్థానం
(గుజరాత్‌ నుంచి నీరేంద్రదేవ్‌)

వాద్‌నగర్‌: గుజరాత్‌లోని  ఉంఝా నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కారణం- ప్రధాని మోదీ స్వస్థలం వాద్‌నగర్‌ ఈ స్థానం పరిధిలోనే ఉంది. అందుకే ఈ నియోజకవర్గాన్ని మోదీతో ముడిపెట్టి చూస్తుంటారు. ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఉన్న ఉంఝా.. రెండో విడతలో భాగంగా ఈ నెల 5న ఎన్నికలకు వెళుతోంది. గత ఎన్నికల ఫలితాన్ని చూశాక.. ఇక్కడి పరిస్థితిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 1995 నుంచి ఉంఝాలో గెలుస్తూ వచ్చిన భాజపా 2017 ఎన్నికల్లో పరాజయం పాలైంది. కాంగ్రెస్‌కు చెందిన ఆశాపటేల్‌ భాజపా అభ్యర్థిని నాడు ఓడించారు. మోదీ స్వస్థలంలో భాజపా చతికిలపడటం ఆశ్చర్యపరిచింది. పార్టీకి అదో అనూహ్య అవమానం!  తర్వాత కొద్దిరోజులకే ఆశాపటేల్‌  భాజపాలో చేరి 2019 ఉప ఎన్నికల్లో  గెలిచారు. దీంతో మళ్లీ ఈ సీటు కమలనాథుల ఖాతాలోనే చేరినట్లయింది.2017 ఓటమి భాజపాను వెంటాడుతూనే ఉంది. ఆ పార్టీ ఈసారి  ఆరెస్సెస్‌ సీనియర్‌ కార్యకర్త కీర్తికుమార్‌ కేశవ్‌లాల్‌ను బరిలోకి దించింది. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌కు సన్నిహితుడైన    67 ఏళ్ల కీర్తిభాయ్‌  సులభంగా నెగ్గుతారనేది భాజపా విశ్వాసం. కాంగ్రెస్‌ నుంచి అర్వింద్‌ అమర్త్‌లాల్‌ పటేల్‌, ఆప్‌ తరఫున ఉర్విష్‌ పటేల్‌ బరిలో ఉన్నారు. పాటీదార్‌ ఉద్యమం, స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత కారణంగా గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈసారి గెలుపుపై కమలనాథులు ధీమాగా ఉన్నారు.

ఉత్తరాన ఆధిపత్యమెవరిదో!

గుజరాత్‌లో 93 సీట్లకు ఈ నెల 5న పోలింగ్‌ జరగనుంది. రాజకీయంగా కీలకమైన ఈ నియోజకవర్గాలన్నీ ఉత్తర (32), సెంట్రల్‌ గుజరాత్‌ (61)ల్లో ఉన్నాయి. గత ఎన్నికల్లో సెంట్రల్‌ గుజరాత్‌లో భాజపా 37 సీట్లు గెల్చుకుంది. 22 స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలో చేరాయి. ఇద్దరు స్వతంత్రులు నెగ్గారు. 2012 ఫలితాలతో పోలిస్తే ఇక్కడ భాజపా సీట్లు (ఆ ఎన్నికల్లో 52) తగ్గడం గమనార్హం. ఉత్తర గుజరాత్‌లోని ఆరు జిల్లాల్లో 32 సీట్లకుగాను 2017లో కాంగ్రెస్‌ 17 చోట్ల నెగ్గగా, కమలదళానికి 14 మాత్రమే దక్కాయి. ఈసారి ఆప్‌ దెబ్బతీయకుంటే ఉత్తర గుజరాత్‌లో కాంగ్రెస్‌కే మొగ్గు ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని