జగన్‌, చంద్రబాబు, పెద్దిరెడ్డి చిత్తశుద్ధి లేని నాయకులు

రాయలసీమ అభివృద్ధిపై సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేష్‌నాయుడు విమర్శించారు.

Published : 04 Dec 2022 04:04 IST

భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ నాయుడి ధ్వజం

పీలేరు, న్యూస్‌టుడే: రాయలసీమ అభివృద్ధిపై సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేష్‌నాయుడు విమర్శించారు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం నర్తనశాలకు శనివారం వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వంలో రాయలసీమకు వచ్చిన పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నా నాయకులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏర్పాటై మూడున్నరేళ్లు అయినా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కర్నూలులో న్యాయ రాజధాని అని జగన్‌ ప్రోద్బలంతో న్యాయవాదులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం కొలీజియంతో ఇంత వరకు చర్చించలేదు...’ అని పేర్కొన్నారు.  ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల, జాతీయ రహదారుల అభివృద్ధి అన్నది భాజపా నిర్ణయమని, దీన్ని కూడా వైకాపా నాయకులు వారు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘వైఎస్‌ఆర్‌కు సన్నిహితంగా ఉన్న గల్లా కుటుంబీకుల ఫ్యాక్టరీలపై కక్ష కట్టారు. అందువల్లనే రూ.9,500 కోట్లతో ఏర్పాటు చేయాలనుకున్న ఫ్యాక్టరీని వారు పక్క రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురంలో జాకీ పరిశ్రమ కూడా వైకాపా నాయకుల వల్లనే ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లింది. అనంతపురంలో 200 ఎకరాలకు సాగు, మూడు మండలాలకు తాగునీటి సౌకర్యం అందించే భైరవాని ప్రాజెక్టును కట్టలేని ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది...’ అని పేర్కొన్నారు. హైకోర్టు... రాజధాని ప్రాంతంలోని ఉంటుందని జగన్‌ న్యాయవాది కేకే నాయుడు ద్వారా చెప్పించిన ముఖ్యమంత్రి ఇప్పుడు కర్నూలులో అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. పరిపాలన రాజధాని విశాఖలో ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమ ప్రజలకు చాలా దూరమవుతుందని ప్రతి ఒక్కరికీ తెలిసినా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు విప్పడం లేదని రమేష్‌నాయుడు ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని