కేసీఆర్‌ ఉద్యోగం తీసేస్తేనే.. యువతకు కొలువులు

రాష్ట్రంలో నిరుద్యోగ రేటు రోజురోజుకు పెరుగుతోందని.. దేశంలో 6.8 శాతముంటే రాష్ట్రంలో 8.8 శాతం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Published : 04 Dec 2022 05:12 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నిరుద్యోగ రేటు రోజురోజుకు పెరుగుతోందని.. దేశంలో 6.8 శాతముంటే రాష్ట్రంలో 8.8 శాతం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ ఉద్యోగం తీసేస్తేనేే..యువతకు కొలువులు వస్తాయన్నారు. శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ మలి ఉద్యమ అమరుడు శ్రీకాంత్‌చారి వర్ధంతి సందర్భంగా విద్యార్థి జన సమితి, యువజన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ యువజన దినోత్సవ సదస్సు నిర్వహించారు. సదస్సులోనూ, అనంతరం మీడియాతోనూ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఒకే కుటుంబం అధికారాన్ని అనుభవిస్తోందని ఆయన విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఐకాస ఏర్పాటు చేసిన, జెండాలు కట్టినవారికి దక్కిందేమీ లేదన్నారు. ఆత్మబలిదానం చేసినవారిని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా అమరవీరుల స్తూపం నిర్మాణాన్ని పూర్తి చేయలేదన్నారు. ఉద్యమ సమయంలో పోలీసులు క్యాంపస్‌ బయటే ఉన్నారని, నేడు వసతి గృహాల్లోకి ప్రవేశించి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓయూ కేంద్రంగానే తుది దశ తెలంగాణ పోరాటం ప్రారంభించాలని సూచించారు. తెరాస, భాజపా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను దిల్లీలో ఎందుకు విచారించరని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతి చిట్టా బయటపెట్టాలంటే కోకాపేట భూములపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.  సదస్సులో తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యోగాలు సాధించాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. విశ్వవిద్యాలయాలు చర్చలకు వేదికలుగా ఉండాలన్నారు. ఓయూ చరిత్రను అర్థం చేసుకుంటేనే తెలంగాణ చరిత్ర అర్థమవుతుందని చెప్పారు. ప్రొ.హరగోపాల్‌ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సదస్సులో ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌, స్థానికులకే అవకాశాలు, నిరుద్యోగ భృతిపై తీర్మానాలు చేశారు. విద్యార్థి జన సమితి, యువజన సమితి నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని