భాజపాతోనే తెలంగాణలో మార్పు

రాష్ట్రంలో భాజపాను మరింత శక్తిమంతం చేస్తామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం కొనసాగిస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 04 Dec 2022 05:12 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
భాజపాలో చేరిన మర్రి పురూరవ రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భాజపాను మరింత శక్తిమంతం చేస్తామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం కొనసాగిస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో మార్పు భాజపా ద్వారానే సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు పురూరవ రెడ్డితో పాటు వివిధ పార్టీల మాజీ కార్పొరేటర్లు కిషన్‌రెడ్డి సమక్షంలో శనివారం సాయంత్రం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. అంతకుముందు.. భాజపా తీర్థం స్వీకరించాక తొలిసారి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మర్రి శశిధర్‌రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ- మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించారని.. ఆయన కుమారుడు శశిధర్‌రెడ్డి చేరికతో రాష్ట్రంలో, హైదరాబాద్‌లో భాజపా మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. మర్రి సేవల్ని భాజపా పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటుందన్నారు.

సీఎం కుమార్తె అయినా చట్టాలకు అతీతం కాదు: లక్ష్మణ్‌

తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు వంటి పథకాలన్నీ కుంభకోణాలే అని భాజపా ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. వాటి లబ్ధిదారుల జాబితాతో శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మర్రి శశిధర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యావంతులు, మేధావులు రాష్ట్రాన్ని కాపాడేందుకు భాజపాతో కలసిరావాలని కోరారు. ‘తెలంగాణలో ఏడాదికి సుమారు రూ.40వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం రాబడుతోంది. మద్యం కుంభకోణం దిల్లీ వరకు విస్తరించిందంటే ఈ పాలసీని రాష్ట్రంలో ఎలా అమలుచేశారో చూడాలి. సీఎం కుమార్తె చట్టాలకు అతీతం కాదు. ఏ తప్పు చేయకుంటే భయం ఎందుకు? కుంభకోణంలో పాత్ర లేకుంటే నిజాయతీని ఆమె నిరూపించుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

తెరాసపై తీవ్ర వ్యతిరేకత: మర్రి

తెరాసపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. 1994 ఎన్నికల్లో ఓటమికి ముందు కాంగ్రెస్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆయన అన్నారు. ‘నా అనుభవంతో చెబుతున్నా.. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చితీరుతుంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను వదిలేసింది. రాష్ట్రంలో భాజపా, తెరాసల మధ్యే పోటీ ఉంటుంది. తెలంగాణలో భాజపాకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది’ అని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో భాజపా నేతలు ఎస్‌.కుమార్‌, ప్రకాశ్‌రెడ్డి, శ్యాంసుందర్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని