ప్రజలను మోసగించడానికే సీమగర్జన

అధికారంలో ఉన్న పార్టీలు హామీలు అమలుచేయడం, ప్రతిపక్షాలు ఉద్యమించడం ఇదివరకు చూశామని, జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్నీ రివర్స్‌గా జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవాచేశారు.

Published : 05 Dec 2022 03:41 IST

కర్నూలులో హైకోర్టు ఎందుకు పెట్టలేదో జగన్‌ చెప్పాలి
పారిశ్రామికవేత్తలపై ప్రభుత్వ దౌర్జన్యకాండ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం

ఈనాడు, దిల్లీ: అధికారంలో ఉన్న పార్టీలు హామీలు అమలుచేయడం, ప్రతిపక్షాలు ఉద్యమించడం ఇదివరకు చూశామని, జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్నీ రివర్స్‌గా జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవాచేశారు. వైకాపా సోమవారం కర్నూలులో తలపెట్టిన సీమగర్జన సభ.. ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. దిల్లీలో రెండు రోజులు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ‘భాజపా, వైకాపాలు కర్నూలులో హైకోర్టు పెడతామని హామీ ఇచ్చి, అధికారంలో ఉండీ అమలు చేయలేదు. ఇటీవల సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన కేకే వేణుగోపాల్‌ హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, కర్నూలుకు తరలించబోమని చెప్పారు. అంటే, రాయలసీమ ప్రజలను మోసగించేందుకే సీమగర్జన’ అని ఆరోపించారు. జగన్‌ సీమకు చేసిందేమీ లేదని, హంద్రీ-నీవా కాలువలను రెండింతలు వెడల్పు చేస్తానని చెప్పి కనీసం నీళ్లివ్వలేదని దుయ్యబట్టారు. ‘రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి వెళ్లిపోతున్నాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని జాకీ పరిశ్రమను రాప్తాడు ఎమ్మెల్యే బెదిరించడంతో వారు హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కియా పరిశ్రమ విస్తరణను మానుకుంది. చిత్తూరు జిల్లాలో అమరరాజా ఫ్యాక్టరీ విస్తరణ ఆపేసి, తెలంగాణకు వెళ్లిపోతోంది. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెడతానన్న ముఖ్యమంత్రి.. మూడోసారి శంకుస్థాపన చేసి పది అడుగుల పని కూడా చేయలేదు. ప్రభుత్వ దౌర్జన్యకాండ వల్ల ఎవరూ పరిశ్రమలు పెట్టడంలేదు. ఈ సమయంలో సీమగర్జనతో ఏం చేయాలనుకుంటున్నారు?’ అని రామకృష్ణ ప్రశ్నించారు. కడప జిల్లాలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటు కోరుతూ ఈనెల 9 నుంచి 13 వరకు సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టే పాదయాత్రకు అన్ని పార్టీలనూ ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని