‘ముందస్తు’ వస్తే బస్సు యాత్ర?

రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా సన్నద్ధతపై కమలదళం దృష్టి సారించింది.

Updated : 05 Dec 2022 06:17 IST

రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా సన్నద్ధతపై కమలదళం దృష్టి సారించింది. ప్రజాసంగ్రామ యాత్రతో ప్రజలను కలుస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తే బస్సు యాత్ర చేయాలని యోచిస్తున్నారు. పాదయాత్ర నిర్వాహకులు, ఇతర నేతలతో ఈ అంశంపై ఆయన చర్చిస్తున్నారు. మరోవైపు పాదయాత్ర చేస్తూనే.. జిల్లాల వారీగా ముఖ్య నేతలతో సంజయ్‌ సమావేశం అవుతున్నారు. ఈ నెల 3న నిర్మల్‌, 4న మంచిర్యాల జిల్లా నేతలతో సమీక్షించారు. పార్టీ మండల అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులు, పార్టీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో భాజపా బలోపేతంపై చర్చించారు. 5న ఆదిలాబాద్‌, 6న నిజామాబాద్‌, 7న ఆసిఫాబాద్‌, కామారెడ్డి.. ఆ తర్వాత మిగిలిన జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు.

తొలి నాలుగు విడతల ప్రజాసంగ్రామ యాత్రల్లో బండి సంజయ్‌ 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న అయిదో విడత యాత్ర 8 నియోజకవర్గాల్లో సాగనుంది. ఈ నెల 16న లేదా 18న పూర్తవుతుంది. నెలాఖరులో హైదరాబాద్‌ నగరంలో పది రోజులు 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని సంజయ్‌ నిర్ణయించారు. రూట్‌మ్యాప్‌ ఖరారుచేయాలని పాదయాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డికి సూచించారు. అంటే అప్పటికి 66 నియోజకవర్గాల్లో యాత్ర పూర్తవుతుంది. తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందంటూ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కమలనాథులు చర్చిస్తున్నారు. ముందస్తు వస్తే.. మిగిలిన 53 నియోజకవర్గాలను చుట్టి రావడానికి వీలుగా బస్సు యాత్ర నిర్వహణ అంశాన్ని సంజయ్‌ పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున బస్సు యాత్ర చేసేలా ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు రాకపోతే మార్చి వరకు పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ నేత ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని