చేతకాకుంటే.. పదవుల్ని వీడండి

కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉన్న నేతలు సహా ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.

Published : 05 Dec 2022 04:47 IST

పార్టీలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాల్సిందే
కాంగ్రెస్‌ నేతలకు ఖర్గే ఘాటు సూచనలు
రాయ్‌పుర్‌ వేదికగా ఫిబ్రవరి ద్వితీయార్ధంలో ప్లీనరీ
స్టీరింగ్‌ కమిటీ భేటీలో నిర్ణయం

దిల్లీ: కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉన్న నేతలు సహా ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. అలా ఉండటం చేతకాకపోతే పదవుల్ని వీడాలని ఘాటుగా సూచించారు. దిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఆదివారం పార్టీ స్టీరింగ్‌ కమిటీ తొలి సమావేశంలో ఆయన పలు అంశాలపై నిష్కర్షగా మాట్లాడారు. మరోవైపు- తమ తదుపరి ప్లీనరీ సమావేశాలను ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి ద్వితీయార్ధంలో నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. తాము ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భారత్‌ జోడో యాత్రను జనవరి 26లోగా ముగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. జనానికి మరింతగా దగ్గరయ్యేందుకు ఆపై రెండు నెలలపాటు (మార్చి 26 వరకు) ‘చేయిచేయి కలపండి’ పేరుతో దేశవ్యాప్తంగా గ్రామ, జిల్లా స్థాయుల్లో పెద్దఎత్తున పాదయాత్రలు సహా ఇతర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది.

స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. పార్టీలో వ్యవస్థాగత జవాబుదారీతనం (పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు) ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. విధులను సరిగా నిర్వర్తించలేనివారు పదవుల్ని వీడి ఇతరులకు మార్గం సుగమం చేయాలని సూచించారు. పార్టీలో కొందరు చాలా బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నారని కితాబిచ్చారు. మరికొందరు మాత్రం బాధ్యతారాహిత్యంగా ఉన్నా పర్వాలేదులే అని ఊహించుకుంటున్నారని, అలాంటివారిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ముందుగా పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంఛార్జులు తమ విధులను సక్రమంగా పూర్తిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వారి పర్యటనల గురించి ఆరాతీశారు. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌, సీనియర్‌ నేతలు పి.చిదంబరం, ఆనంద్‌ శర్మ, మీరాకుమార్‌, అంబికా సోని తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై చర్చించారు.

* పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలను రాయ్‌పుర్‌లో మూడు రోజులపాటు నిర్వహించాలని స్టీరింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు కె.సి.వేణుగోపాల్‌ తెలిపారు. అక్కడ భారీ బహిరంగ సమావేశాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పారు. జోడో యాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో తమ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరుకావడం సాధ్యంకాదని ఆయన అన్నారు. యాత్రపై రాహుల్‌ సందేశాన్ని ‘చేయిచేయి కలపండి’ కార్యక్రమంలో భాగంగా లేఖల ద్వారా ప్రజలకు పంచనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారుపై ఓ అభియోగపత్రాన్ని కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని