సీఎంను తిడితే ఊరుకోం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని, అలాంటి వారిని ఉరికించాలని తెరాస కార్యకర్తలు, నాయకులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

Published : 05 Dec 2022 04:47 IST

షర్మిలపై మంత్రుల ఆగ్రహం

కేసముద్రం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని, అలాంటి వారిని ఉరికించాలని తెరాస కార్యకర్తలు, నాయకులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌ జిల్లాలో మండలంగా ఏర్పాటైన ఇనుగుర్తిలో ఆదివారం నిర్వహించిన కార్యాలయ ప్రారంభ సమావేశంలో మంత్రి దయాకర్‌రావుతోపాటు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీలు మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, జల వనరుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ప్రకాశ్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వైతెపా అధ్యక్షురాలు షర్మిలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి గాలి మనుషులు వస్తున్నారు. అవకాశాల కోసం ఈ ప్రాంత ప్రజలను, రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తున్నారు. షర్మిల చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. మానుకోట రాళ్లను ఆమె మరిచిపోయినా.. ఇక్కడి ప్రజలు మరిచిపోలేదు. రాజన్న రాజ్యం తెస్తానని అంటున్న ఆమె.. వైఎస్సార్‌ ప్రత్యేక రాష్ట్రానికి అడ్డుపడిన తెలంగాణ ద్రోహి కాదా’’ అని ప్రశ్నించారు.

తెరాసతోనే శ్రీరామరక్ష: కల్వకుంట్ల కవిత

ఆలేరు, న్యూస్‌టుడే: పోరాడి సాధించుకున్న తెలంగాణకు, ఇక్కడి ప్రజలకు తెరాసతోనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తన ఇంట్లో పనిచేసే సహాయకుడి వివాహంలో పాల్గొనేందుకు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వచ్చిన ఆమె.. ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేసీఆర్‌ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే తలమాణికంగా నిలుస్తున్నాయని చెప్పారు. ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించేలా యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి చేశామని, ఇది కేసీఆర్‌కు తప్ప ఇంకెవరితోనూ సాధ్యమయ్యే పని కాదని పేర్కొన్నారు.


కవితకు ఓయూ ఐకాస,ఆటోమోటార్‌ కార్మిక సంఘాల మద్దతు

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐకాస, తెలంగాణ ఆటోమోటార్‌ కార్మిక సంఘాలు తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంఘీభావం తెలిపాయి. ఈ సంఘాల అధ్యక్షులు ఎల్చల దత్తాత్రేయ, వేముల మారయ్యల నేతృత్వంలోని ప్రతినిధులు ఆదివారం కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసి తమ మద్దతు తెలిపారు. కేసీఆర్‌ భారాస పార్టీని ప్రకటించాక భాజపాలో వణుకు పుట్టిందని, కవితను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు సంస్థల ద్వారా నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని వారు విమర్శించారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని