పాదయాత్ర ఎన్నో నేర్పుతోంది

పాదయాత్ర తనకెన్నో విషయాలు నేర్పిందనీ, విమానంలోనో, ఇతర వాహనంలోనో ప్రయాణించినట్లయితే ఇవేవీ తెలిసేవి కావని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు.

Published : 05 Dec 2022 04:47 IST

వాహనాల్లో ప్రయాణిస్తే ఇవేవీ  తెలిసేవి కావు: రాహుల్‌
రాజస్థాన్‌లో ప్రవేశించిన భారత్‌ జోడో 

జైపుర్‌, భోపాల్‌, దిల్లీ: పాదయాత్ర తనకెన్నో విషయాలు నేర్పిందనీ, విమానంలోనో, ఇతర వాహనంలోనో ప్రయాణించినట్లయితే ఇవేవీ తెలిసేవి కావని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. ఆయన చేపట్టిన భారత్‌జోడో పాదయాత్ర ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్‌ నుంచి రాజస్థాన్‌లో ప్రవేశించింది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మధ్య కలహాలున్నా.. పార్టీ పాలిత రాష్ట్రంలో ఆయనకు పెద్దఎత్తున సంప్రదాయబద్ధ స్వాగతం లభించింది. ఆకుపచ్చ తివాచీ పరిచి, డప్పుల మోతతో అట్టహాసంగా కార్యకర్తలు, ప్రజలు ఆయన్ని ఆహ్వానించారు. రాహుల్‌, గహ్లోత్‌, పైలట్‌ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని డ్యాన్స్‌ చేశారు. రైతులతో చేతులు కలిపితేనే వారు చేసేదేమిటో ఎవరికైనా అర్థమవుతుందని రాహుల్‌ చెప్పారు. భాజపా, ఆరెస్సెస్‌ అంటే తన గుండెల్లో ద్వేషం లేదనీ, దేశంలో అవి విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంటే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. 2004లో తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 24 గంటలూ విస్తృత ప్రచారం కల్పించిన మీడియాయే ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతోందంటూ 2.15 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.

17 రోజులు.. 500 కి.మీ.

రాజస్థాన్‌లో 17 రోజుల్లో 500 కి.మీ. మేర రాహుల్‌ యాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో యాత్ర జరగడం ఇదే తొలిసారి. యాత్రవరకు పార్టీ రాష్ట్రశాఖ ఒక్కమాటపై ఏర్పాట్లన్నీ చేస్తోందనీ, కొన్ని తరాలపాటు గుర్తుపెట్టుకునేలా- మిగిలిన రాష్ట్రాల కంటే ఇక్కడ ఎక్కువ విజయవంతం అవుతుందని సచిన్‌ పైలట్‌ ఆదివారం ఒక వార్తాసంస్థకు తెలిపారు. ఏడాది తర్వాత జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇది ఊపు తెస్తుందని చెప్పారు. ‘‘ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు భాజపాలోనే 12 మంది ఉన్నారు. అంతటి అనైక్యత కారణంగానే కమలనాథులు విపక్ష పాత్రనైనా పోషించలేకపోతున్నారు. ఐదేళ్లకోసారి అధికారాన్ని మార్చడం రాజస్థాన్‌లో అలవాటుగా వస్తోంది. దీనిని మార్చాలి. ఆ దిశగా ఏది కావాలన్నా ఐక్యంగా చేస్తాం’’ అని తెలిపారు.

రాహుల్‌తో చర్చకు భాజపా సిద్ధమా?: కమల్‌నాథ్‌

మతం, ఆధ్యాత్మికతలపై రాహుల్‌గాంధీతో చర్చకు భాజపా, ఆరెస్సెస్‌, విశ్వహిందూ పరిషత్‌ సిద్ధమేనా అని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ ప్రశ్నించారు. చర్చించినట్లయితే ఈ అంశాలపై రాహుల్‌కే ఎక్కువ అవగాహన ఉందనేది రుజువవుతుందని చెప్పారు. రాహుల్‌ యాత్రకు మంచి స్పందన లభిస్తోందనీ, దేశ తూర్పు భాగం నుంచి పశ్చిమ భాగానికి ఆయన మరోయాత్ర చేపట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని