కొడంగల్‌ను అభివృద్ధి చేస్తే.. కేటీఆర్‌ను సన్మానిస్తా: రేవంత్‌

కొడంగల్‌ను దత్తత తీసుకున్న కేటీఆర్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే.. అక్కడ అఖిలపక్ష సమావేశం నిర్వహించి మంత్రిని, ఎమ్మెల్యేను సన్మానించే బాధ్యత తనదేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 05 Dec 2022 09:46 IST

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: కొడంగల్‌ను దత్తత తీసుకున్న కేటీఆర్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే.. అక్కడ అఖిలపక్ష సమావేశం నిర్వహించి మంత్రిని, ఎమ్మెల్యేను సన్మానించే బాధ్యత తనదేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన దౌల్తాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొడంగల్‌ నియోజకవర్గాన్ని నాలుగేళ్ల క్రితం మంత్రి కేటీఆర్‌ దత్తత తీసుకుని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ‘‘మునుగోడును దత్తత తీసుకుంటానని ఉప ఎన్నిక సందర్భంగా ప్రకటించారు. గెలిచిన వెంటనే అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొడంగల్‌లో తెరాస అభ్యర్థి గెలుపొంది నాలుగేళ్లయినా ఒక్కసారైనా అభివృద్ధిపై మంత్రి సమీక్ష నిర్వహించి నిధులు కేటాయించారా?’’ అని నిలదీశారు. మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై సీఎం ప్రకటన చేయలేదని విమర్శించారు. గోదావరి జలాలను ఈ ప్రాంతానికి అందించేలా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రయత్నం చేస్తే కేసీఆర్‌ నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.

నేడు కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్‌ ధర్నాలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ధరణి, భూ సమస్యలు, భూమిపై హక్కు, వ్యవసాయం, రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 5న సోమవారం(నేడు) కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ఉదయం 11 గంటలకు ధర్నాలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని రేవంత్‌రెడ్డి శ్రేణులను కోరారు.

సమస్యలు పక్కదారి పట్టించేందుకే నోటీసుల డ్రామా: షబ్బీర్‌అలీ

ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడానికే భాజపా, తెరాస నోటీసుల డ్రామా ఆడుతున్నాయని మాజీమంత్రి షబ్బీర్‌అలీ ఆదివారం ఆరోపించారు. ఈడీ నోటీసులు ఇస్తే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ లాంటి వాళ్లే హాజరయ్యారు, దిల్లీ మద్యం కేసులో కవిత ఎందుకు వెళ్లరు? ఆమె ఇంటికే దర్యాప్తు సంస్థ అధికారులు ఎలా వస్తారు? అందరినీ ఆఫీస్‌కు పిలిచి ఆమెను ఎందుకు పిలవరు?.. అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసులోనూ బీఎల్‌ సంతోష్‌ ‘సిట్‌’ విచారణకు వస్తే తప్పేంటి? అని నిలదీశారు.

యువత సమస్యలపై పోరాటం: కృష్ణ అలవరు

యువత సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని యువజన కాంగ్రెస్‌ జాతీయ ఇన్‌ఛార్జి కృష్ణ అలవరు పిలుపునిచ్చారు. విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథి కృష్ణ మాట్లాడుతూ..ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని