అహ్మదాబాద్‌ సీట్లతోనే పెద్దపీట

శాసనసభ ఎన్నికల్లో పార్టీల విజయంలో అహ్మదాబాద్‌ నగరంలోని 16 సీట్లు భాజపాకు కీలకం కానున్నాయి. సోమవారం మలిదశ ఎన్నికలు జరిగే స్థానాల్లో ఇవి కూడా ఉన్నాయి.

Published : 05 Dec 2022 06:15 IST

ఆ 16 స్థానాలు అన్ని పార్టీలకూ కీలకం  
గుజరాత్‌లో నేడు మలిదశ పోలింగ్‌

అహ్మదాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో పార్టీల విజయంలో అహ్మదాబాద్‌ నగరంలోని 16 సీట్లు భాజపాకు కీలకం కానున్నాయి. సోమవారం మలిదశ ఎన్నికలు జరిగే స్థానాల్లో ఇవి కూడా ఉన్నాయి. 1990 నుంచి కమలనాథుల ఆధిపత్యం ఈ నగరంపై అప్రతిహతంగా కొనసాగుతోంది. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు సీట్లే లభించగా 2017లో అవి నాలుగుకు పెరిగాయి. మిగిలిన 12 కూడా భాజపా ఖాతాలో చేరాయి. ఈసారి భాజపా, కాంగ్రెస్‌లతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రంగంలో దిగడంతో ఎవరికి ఎన్నిసీట్లు వెళ్తాయి, మొత్తం రాష్ట్రం మీద దాని ప్రభావం ఎలా పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ 16 సీట్లలోనూ ఆప్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎంఐఎం నాలుగుచోట్ల పోటీ చేస్తోంది. దీనివల్ల కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ ఓట్లకు గండి పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అహ్మదాబాద్‌ నగరం అత్యంత కీలకం కావడంతో ప్రధాని నరేంద్రమోదీ కూడా రెండురోజుల్లో 40 కి.మీ. మేర రోడ్‌షోల్లో పాల్గొన్నారు. దీని ప్రభావం, కొన్ని దశాబ్దాలుగా నగరంపై ఉన్న పట్టు కారణంగా ఈసారీ తమదే ఆధిక్యమని కమలనాథులు ధీమాగా ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్రమోదీ కూడా గతంలో అహ్మదాబాద్‌ నగర నియోజకవర్గాల నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు.

పోలింగు ఏర్పాట్లు పూర్తి

182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీలో 89 స్థానాలకు ఈ నెల ఒకటో తేదీన ఎన్నికలు జరగ్గా, మిగిలిన 93 స్థానాలకు సోమవారం పోలింగ్‌ నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భాజపా, ఆప్‌ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. గుజరాత్‌తో పాటు యూపీలోని మైన్‌పురి లోక్‌సభ స్థానానికి, ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా సోమవారం జరగనున్నాయి. అన్నిచోట్లా 8న ఓట్ల లెక్కింపు చేపడతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు